Aditya Birla Capital: గోల్డ్ లోన్ రంగంలోకి బిర్లాలు.. మూడేళ్లలో 1000 బ్రాంచులు.. ముత్తూట్‌కు పోటీ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లాకు చెందిన ఆదిత్య బిర్లా గ్రూప్ అనుబంధ సంస్థ ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ (ABCL) గోల్డ్ లోన్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఆగస్టు 20న కంపెనీ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. ఇప్పటికే ఉన్న సురక్షిత రుణాల వ్యాపారాన్ని మరింత విస్తరించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. గోల్డ్ లోన్ల కోసం ప్రత్యేక బ్రాంచులు గోల్డ్ లోన్ వ్యాపారాన్ని దశలవారీగా విస్తరించాలని ABCL నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రత్యేకంగా గోల్డ్ లోన్ సేవలు అందించే శాఖలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయనుంది. తొలిదశలో 2027 మార్చి నాటికి 200 నుంచి 300 బ్రాంచులను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
వివరాలు
ఇప్పటికే విస్తృతమైన రుణ సేవలు
అనంతరం రాబోయే మూడేళ్లలో ఈ సంఖ్యను 1000 బ్రాంచులకు పెంచాలని నిర్ణయించింది. ఈ వివరాలను కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.
ABCLకు చెందిన NBFC విభాగంలో ఈ కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారు.
గోల్డ్ లోన్ల ద్వారా ఇప్పటికే ఉన్న రిటైల్, MSME రుణ వ్యాపారానికి మరింత బలం చేకూరుతుందని కంపెనీ భావిస్తోంది.
ప్రస్తుతం సంస్థ వ్యక్తిగత రుణాలు, చిన్న వ్యాపారాలకు రుణాలు,పెద్ద కార్పొరేట్ సంస్థలకు మార్ట్గేజ్ లోన్లు అందిస్తోంది.
ఇవే కాకుండా హోమ్ లోన్స్, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ బ్రోకింగ్ వంటి సేవలను కూడా ABCL అందిస్తోంది.
ఆర్థిక సేవల రంగంలో ఉన్న ఈ అనుభవంతో వినియోగదారులకు మరింత పారదర్శకంగా, సౌకర్యవంతంగా తాకట్టు ఆధారిత రుణాలను అందించగలమని సంస్థ చెబుతోంది.
వివరాలు
పెరిగిన ఆదిత్య బిర్లా క్యాపిటల్ షేరు
సాధారణంగా బంగారాన్ని తాకట్టుగా తీసుకుని ఇచ్చే రుణాల్లో రిస్క్ తక్కువగా ఉంటుందని, అందువల్ల ఇవి సంస్థలకు సురక్షితమైన రుణాలుగా పరిగణిస్తారు.
గోల్డ్ లోన్ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్లు కంపెనీ ప్రకటించడంతో స్టాక్ మార్కెట్లో ABCL షేరు ధర కూడా కదిలింది.
అంతకుముందు సెషన్‌లో రూ.396 వద్ద ముగిసిన షేరు.. గురువారం దాదాపు ఒక శాతం లాభంతో రూ.399.80 వద్ద ప్రారంభమైంది.
ఇంట్రాడేలో మరింత లాభపడుతూ 2.50 శాతం వరకు ఎగసి రూ.406.50 గరిష్ఠాన్ని తాకింది.
ఈ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ.430.70 కాగా.. కనిష్ఠ ధర రూ.272.70గా ఉంది. కంపెనీ మార్కెట్ విలువ సుమారు రూ.1.06 లక్షల కోట్లుగా ఉంది.
వివరాలు
భద్రతతో కూడిన రుణాలపై దృష్టి
గత కొంతకాలంగా ABCL షేరు మంచి వృద్ధిని నమోదు చేస్తోంది. ఏడాది వ్యవధిలో షేరు ధర సుమారు 42 శాతం పెరగడం గమనార్హం.
భారతదేశంలో ప్రస్తుతం గోల్డ్ లోన్ విభాగం వేగంగా వృద్ధి చెందుతోందని ABCL NBFC విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ రాకేష్ సింగ్ తెలిపారు.
ఈ సమయంలో గోల్డ్ లోన్ మార్కెట్లోకి ఆదిత్య బిర్లా క్యాపిటల్ ప్రవేశించడం వల్ల తమ సురక్షిత రుణాల విస్తరణకు మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు.
గోల్డ్ లోన్ కార్యకలాపాలను పునాది స్థాయి నుంచే సమర్థంగా నిర్మించి నిర్వహించడంపై దృష్టి పెడుతున్నట్లు రాకేష్ సింగ్ తెలిపారు.
ముఖ్యంగా వినియోగదారులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే విధానంతో ఈ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు.
వివరాలు
గోల్డ్ లోన్ వ్యాపారాల్లోకి టాటా, గోద్రెజ్ సంస్థలు
గోల్డ్ లోన్ మార్కెట్‌పై ఇటీవల కాలంలో ఇతర పెద్ద సంస్థలు కూడా ఆసక్తి చూపుతున్నాయి.
టాటా క్యాపిటల్, గోద్రెజ్ క్యాపిటల్ ఇప్పటికే ఈ రంగంలోకి అడుగుపెట్టేందుకు చర్యలు చేపట్టాయి.
టాటా క్యాపిటల్.. యోగక్షేమం లోన్స్ లిమిటెడ్‌లో 88.6 శాతం వాటాను రూ.360-365 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది.
మరోవైపు కనకదుర్గ ఫైనాన్స్‌లో వాటా కొనుగోలు చేసేందుకు గోద్రెజ్ క్యాపిటల్ ఆసక్తి చూపిస్తోంది.
ఇలా వరుసగా పెద్ద కార్పొరేట్ సంస్థలు గోల్డ్ లోన్ రంగంపై దృష్టి సారిస్తుండటంతో ఈ విభాగంలో పోటీ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
వివరాలు
ముత్తూట్, మణప్పురానికి సవాల్?
ఇప్పటివరకు గోల్డ్ లోన్ మార్కెట్లో ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్ వంటి సంస్థలు బలమైన స్థానం కలిగి ఉన్నాయి.
అయితే ఆదిత్య బిర్లా క్యాపిటల్‌తో పాటు టాటా క్యాపిటల్, గోద్రెజ్ క్యాపిటల్ వంటి పెద్ద సంస్థలు కూడా ఈ రంగంలోకి రావడం సంప్రదాయ గోల్డ్ లోన్ సంస్థలకు కొత్త సవాలుగా మారే అవకాశం ఉంది.
ముఖ్యంగా ABCL మూడేళ్లలో 1000 ప్రత్యేక బ్రాంచులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం వల్ల దేశవ్యాప్తంగా గోల్డ్ లోన్ సేవల విస్తరణ వేగవంతం కావచ్చు.
దీంతో కస్టమర్లను ఆకర్షించేందుకు వడ్డీ రేట్లు, సేవల వేగం, డిజిటల్ సదుపాయాలు, బ్రాంచ్ నెట్‌వర్క్, రుణ ప్రక్రియ వంటి అంశాల్లో సంస్థల మధ్య పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది.