Loading...
Konda Surekha: తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం.. సొంత నేతల వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీ కొరడా
తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం.. సొంత నేతల వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీ కొరడా

Konda Surekha: తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం.. సొంత నేతల వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీ కొరడా

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 20, 2026
09:26 am

ఈ వార్తాకథనం ఏంటి

పార్టీ ప్రతిష్ఠకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్న సొంత నేతలపై కాంగ్రెస్‌ అధిష్ఠానం ఇక కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. పార్టీకి చెడ్డపేరు వచ్చేలా బహిరంగ వ్యాఖ్యలు చేయడం,అంతర్గత విభేదాలను రచ్చకెక్కించడం వంటి అంశాలను ఏఐసీసీ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తాజాగా ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్‌ క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ (డీఏసీ) పలువురు నేతలకు నోటీసులు జారీ చేసింది. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరుతూ డీఏసీ బుధవారం ఆమెకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది.

వివరాలు 

మూడు రోజుల్లోగా వివరణ

దీంతో పాటు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఆదిలాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి కంది శ్రీనివాస్‌రెడ్డి, ఆదిలాబాద్‌ మున్సిపల్‌ కౌన్సిలర్‌ సంజయ్‌లకు కూడా నోటీసులు జారీ చేసింది.

పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన అంశాలపై మూడు రోజుల్లోగా తమ వివరణ ఇవ్వాలని వారిని ఆదేశించింది.

మరోవైపు ఎల్బీనగర్‌కు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జక్కిడి ప్రభాకర్‌రెడ్డిపై పార్టీ సస్పెన్షన్‌ వేటు వేసింది.

పలువురిని వ్యక్తిగత అంశాల్లో కులాల పేరుతో దూషించిన ఘటనలకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, అందుకే ఆయనపై చర్యలు తీసుకున్నట్లు క్రమశిక్షణ కమిటీ వెల్లడించింది.

వివరాలు 

మంత్రి కుమార్తె వ్యవహారశైలితో..

మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత గతంలో ఒకసారి సీఎం రేవంత్‌ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయగా.. తాజాగా మరోసారి ముఖ్యమంత్రితో పాటు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై విమర్శలు చేయడం కాంగ్రెస్‌ అధిష్ఠానం దృష్టికి వెళ్లినట్లు సమాచారం.

మంత్రి కుటుంబానికి చెందిన వ్యక్తే పార్టీ,ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతినేలా మాట్లాడితే క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలకు పార్టీ ఏం సందేశం ఇస్తుందనే ప్రశ్నలు కాంగ్రెస్‌లో వ్యక్తమవుతున్నాయి.

సుస్మిత గతంలో ఆరోపణలు చేసిన సమయంలోనే చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేసే పరిస్థితి వచ్చేది కాదని కొందరు పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

మంత్రి కుమార్తె వ్యవహారశైలితో..

పార్టీలో ఇప్పటివరకు ప్రత్యక్షంగా పనిచేయని వ్యక్తి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకే కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వాలని ఏ హోదాలో డిమాండ్‌ చేస్తున్నారనే ప్రశ్నను కూడా పీసీసీ వర్గాలు లేవనెత్తుతున్నాయి.

పార్టీపై ఒత్తిడి తెచ్చే విధంగా, బెదిరింపు ధోరణిలో వ్యాఖ్యలు చేయడాన్ని కూడా అధిష్ఠానం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే సుస్మిత వ్యాఖ్యలపై మంత్రి సురేఖ నుంచి వివరణ కోరినట్లు సమాచారం.

ADVERTISEMENT

వివరాలు 

చిన్నారెడ్డి వ్యాఖ్యలపై ఫిర్యాదు

గత అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు తీసుకుని కొందరికి టికెట్లు కేటాయించారంటూ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి చేసిన ఆరోపణలు కూడా కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారాయి.

ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పీసీసీ, డీఏసీతో పాటు ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు.

దీంతో చిన్నారెడ్డి చేసిన ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన డీఏసీ.. వెంటనే విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఈ అంశానికి సంబంధించిన వివరాలను ఏఐసీసీకి కూడా పంపినట్లు పీసీసీ వర్గాలు వెల్లడించాయి.

గత అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక రాజకీయ పరిస్థితుల కారణంగా చిన్నారెడ్డికి టికెట్‌ ఇవ్వలేకపోయిన నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆయనకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి ఇచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

వివరాలు 

చిన్నారెడ్డి వ్యాఖ్యలపై ఫిర్యాదు

అయినప్పటికీ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడాన్ని ఏఐసీసీ తీవ్రంగా తీసుకుంటున్నట్లు సమాచారం.

అయితే తనకు ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ అవకాశం కల్పించడంతో పాటు తన కుమారుడికి కూడా పార్టీ టికెట్‌ ఇవ్వాలని చిన్నారెడ్డి పట్టుబట్టారని ఆయన వ్యతిరేక వర్గీయులు ఆరోపిస్తున్నారు.

ఈ విషయంలో పార్టీ నుంచి హామీ రాకపోవడంతోనే ఆయన తీవ్ర ఆరోపణలు చేశారని వారు చెబుతున్నారు.

వివరాలు 

రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపైనా ఆరా

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కూడా ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఏఐసీసీ రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వాన్ని వివరణ కోరినట్లు సమాచారం.

తనకు మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తితో ఆయన చాలాకాలంగా పార్టీ, ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఇప్పటివరకు రాజగోపాల్‌రెడ్డికి డీఏసీ నుంచి షోకాజ్‌ నోటీసు ఇవ్వలేదని తెలుస్తోంది.

వివరాలు 

ఆదిలాబాద్‌లో బహిరంగ విభేదాలు

ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో మున్సిపల్‌ కౌన్సిలర్‌ సంజయ్‌, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కంది శ్రీనివాస్‌రెడ్డి మధ్య ఉన్న విభేదాలు బహిరంగంగా బయటపడటంపైనా పార్టీ అధిష్ఠానం దృష్టి సారించింది.

ఇటీవల ఏఐసీసీ రాష్ట్ర కార్యదర్శి సచిన్‌ సావంత్‌ ఆధ్వర్యంలో జరిగిన ఆదిలాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ సమావేశంలో ఇద్దరూ పరస్పరం బహిరంగ విమర్శలు చేసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ సమావేశంలో వారు వ్యవహరించిన తీరు పార్టీకి ఇబ్బందికరంగా మారిందని పేర్కొంటూ డీఏసీ బుధవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

మూడు రోజుల్లోగా తమ వివరణ ఇవ్వాలని సంజయ్‌, కంది శ్రీనివాస్‌రెడ్డిని ఆదేశించింది.

వివరాలు 

ఎవరినీ ఉపేక్షించబోం: పీసీసీ

పార్టీ ప్రతిష్ఠకు నష్టం కలిగించేలా వ్యవహరించే విషయంలో నేతల హోదాను చూడబోమని పీసీసీ స్పష్టం చేసింది.

ఎంతటి స్థాయిలో ఉన్న నాయకులైనా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ తెలిపారు.

ఈ వ్యవహారాలపై సమగ్రంగా విచారణ జరిపి నివేదికలు ఇవ్వాలని డీఏసీని ఆదేశించినట్లు చెప్పారు.

నోటీసులు అందుకున్న నేతలపై విచారణ పూర్తిచేసి, వాస్తవాలను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యల కోసం పీసీసీకి నివేదిక సమర్పిస్తామని క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ మల్లు రవి తెలిపారు.

పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారిపై ఇకపై కఠిన చర్యలు తప్పవన్న సంకేతాలను ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

ADVERTISEMENT