Loading...
World badminton: ప్రపంచ బ్యాడ్మింటన్‌.. లక్ష్యసేన్‌కు షాక్‌.. సింధు, ఆయుష్‌ శెట్టి ముందంజ
ప్రపంచ బ్యాడ్మింటన్‌.. లక్ష్యసేన్‌కు షాక్‌.. సింధు, ఆయుష్‌ శెట్టి ముందంజ

World badminton: ప్రపంచ బ్యాడ్మింటన్‌.. లక్ష్యసేన్‌కు షాక్‌.. సింధు, ఆయుష్‌ శెట్టి ముందంజ

వ్రాసిన వారు Moogati Shabari
Aug 20, 2026
09:31 am

ఈ వార్తాకథనం ఏంటి

సొంతగడ్డపై జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు పతకం అందిస్తాడని భావించిన స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. రెండో రౌండ్‌లోనే అతడు టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మరోవైపు తొలి రౌండ్‌లో ప్రపంచ నంబర్‌వన్‌కు షాకిచ్చిన యువ ఆటగాడు ఆయుష్‌ శెట్టి తన జోరును కొనసాగిస్తున్నాడు. మహిళల సింగిల్స్‌లో స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు కూడా ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో బుధవారం లక్ష్యసేన్‌ 21-19, 19-21, 17-21తో అమెరికా ఆటగాడు గారెట్‌ టాన్‌ చేతిలో పరాజయం పాలయ్యాడు. గంటా 13 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో గారెట్‌ టాన్‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు.

వివరాలు

నేరుగా ప్రిక్వార్టర్స్‌లోకి సాత్విక్‌-చిరాగ్‌.. 

కోర్టులో అతడి వేగవంతమైన కదలికలను అందుకోవడం లక్ష్యసేన్‌కు కష్టంగా మారింది.

దీంతో హోరాహోరీగా సాగిన పోరులో చివరకు లక్ష్యకు ఓటమి తప్పలేదు.

మరోవైపు రెండో రౌండ్‌లో ఆయుష్‌ శెట్టి అదరగొట్టాడు. శ్రీలంక ఆటగాడు దుమిందు అబేయ్‌విక్రమపై 21-8, 21-10తో అలవోకగా విజయం సాధించాడు.

దీంతో ఆయుష్‌ ప్రిక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజు-చిరాగ్‌ శెట్టి జోడీకి వరుసగా రెండో రౌండ్‌లోనూ కలిసొచ్చింది.

తొలి రౌండ్‌లో బై లభించిన ఈ భారత జోడీ.. రెండో రౌండ్‌లో స్కాట్లాండ్‌కు చెందిన అలెగ్జాండర్‌ డున్-ఆడమ్‌ ప్రింగిల్‌ జోడీపై ఆడాల్సి ఉంది.

అయితే ప్రత్యర్థి జోడీ వాకోవర్‌ ఇవ్వడంతో సాత్విక్‌-చిరాగ్‌ నేరుగా ప్రిక్వార్టర్స్‌లోకి చేరుకున్నారు.

వివరాలు

ఆరు పాయింట్లు సాధించి తొలి గేమ్‌ సొంతం

మరో భారత జోడీ హరిహరన్‌-ఎం.ఆర్‌. అర్జున్‌ మాత్రం రెండో రౌండ్‌లోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.

దక్షిణ కొరియాకు చెందిన కాంగ్‌ మిన్‌-డాంగ్‌ జు జోడీ చేతిలో 17-21, 14-21తో ఓటమి పాలైంది.

ఇక ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆరో పతకంపై కన్నేసిన పి.వి.సింధు మహిళల సింగిల్స్‌లో ప్రిక్వార్టర్స్‌ చేరుకుంది.

రెండో రౌండ్‌లో కెనడాకు చెందిన వెన్‌ యు జాంగ్‌పై 21-16, 21-17తో విజయం సాధించింది.

కేవలం 35 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ ఆరంభంలో జాంగ్‌ సింధుకు గట్టి పోటీ ఇచ్చింది.

11-10తో సింధు ఆధిక్యంలో ఉన్న సమయంలో భారత షట్లర్‌ జోరు పెంచింది.

వరుసగా ఆరు పాయింట్లు సాధించి తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది.

ADVERTISEMENT

వివరాలు

టోర్నీ నుంచి నిష్క్రమించిన ఉన్నతి..

రెండో గేమ్‌లోనూ జాంగ్‌ అంత తేలిగ్గా లొంగలేదు. అయినప్పటికీ కీలక సమయాల్లో సింధు పైచేయి సాధించి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.

తొమ్మిదో సీడ్‌గా బరిలోకి దిగిన సింధు.. ప్రిక్వార్టర్స్‌లో చైనా క్రీడాకారిణి వాంగ్‌ జి యితో తలపడనుంది.

మరోవైపు యువ షట్లర్‌ ఉన్నతి హుడా పోరాటం రెండో రౌండ్‌లోనే ముగిసింది.

కెనడాకు చెందిన మిచెలీ లి చేతిలో 21-11, 9-21, 21-23తో పోరాడి ఓడింది.

నిర్ణయాత్మక మూడో గేమ్‌లో 21-20తో మ్యాచ్‌ పాయింట్‌ వద్ద నిలిచినప్పటికీ.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది.

చివరకు ఉన్నతి ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ADVERTISEMENT