LOADING...
Air India: ఎకానమీ క్లాస్‌ టికెట్లపై ధరలపై పరిమితి: ఎయిర్‌ ఇండియా కీలక నిర్ణయం
ఎకానమీ క్లాస్‌ టికెట్లపై ధరలపై పరిమితి: ఎయిర్‌ ఇండియా కీలక నిర్ణయం

Air India: ఎకానమీ క్లాస్‌ టికెట్లపై ధరలపై పరిమితి: ఎయిర్‌ ఇండియా కీలక నిర్ణయం

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 08, 2025
09:13 am

ఈ వార్తాకథనం ఏంటి

'ఇండిగో' విమాన సంస్థ ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో టికెట్‌ ధరలు అధికంగా పెరగకుండా నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రకటించిన రేటు పరిమితులను ఎయిర్‌ ఇండియా నేటి నుంచే అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ పరిమితి కేవలం ఎకానమీ క్లాస్‌ టికెట్లకే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని సంస్థ ఎక్స్‌ వేదికగా విడుదల చేసిన ప్రకటన ద్వారా వెల్లడించింది. డిసెంబర్‌ 6న పౌర విమానయాన మంత్రిత్వశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరిస్తూ ఎకానమీ క్లాస్‌ టికెట్లకు బేస్‌ ధరలపై నిర్ణయించిన గరిష్ఠ పరిమితిని తమ బుకింగ్‌ వ్యవస్థలో అమల్లోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. కొత్త ధరలు ఇప్పటికే ఎయిర్‌ ఇండియా రిజర్వేషన్‌ సిస్టంలో ప్రభావంలోకి వచ్చాయని,ఇదే విధంగా ధర పరిమితుల అమలును కొనసాగిస్తామని పేర్కొంది.

వివరాలు 

 వసూలైన మొత్తం మొత్తాన్ని పూర్తిగా రిఫండ్‌ 

వచ్చే కొన్ని గంటల్లో ఈ మార్పులు అన్ని వేదికలపై పూర్తిగా ప్రతిబింబించనున్నట్లు వివరించింది. అదేవిధంగా,థర్డ్‌ పార్టీ బుకింగ్‌ ప్లాట్‌ఫాంలలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా,సేవలు నిరాటంకంగా సాగేందుకు ఈ మార్పులను దశలవారీగా అమలు చేయాల్సి ఉంటుందని చెప్పింది. ఈ మార్పుల సమయంలో ఎవరైనా ప్రయాణికులు నిర్ణయించిన బేస్‌ ధరల కంటే ఎక్కువ మొత్తానికి ఎయిర్‌ ఇండియా ఎకానమీ క్లాస్‌ టికెట్లు బుక్‌ చేసుకుంటే,అదనంగా వసూలైన మొత్తం మొత్తాన్ని పూర్తిగా రిఫండ్‌ చేస్తామని ప్రకటించింది. మరోవైపు,డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) తీసుకొచ్చిన ఎఫ్‌డీటీఎల్‌ నిబంధనలను పాటించడంలో ఇండిగో విఫలమైన సంగతి తెలిసిందే. దీని ప్రభావంతో వందల సంఖ్యలో విమానాలు రద్దుకావడంతో దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో పెద్ద ఎత్తున ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement