Air India: డ్రీమ్‌లైనర్ ప్రమాదం తర్వాత.. ఎయిర్ ఇండియాకి రికార్డు స్థాయిలో రూ.15,000 కోట్ల నష్టం
ఈ వార్తాకథనం ఏంటి
గతేడాది జరిగిన ఘోర విమాన ప్రమాదం,ఆ తర్వాత ఏర్పడ్డ ఎయిర్‌స్పేస్ పరిమితుల ప్రభావంతో ఎయిర్ ఇండియా భారీ నష్టాల బాట పట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో (మార్చి 31తో ముగిసే ఏడాది) కంపెనీ ఏకంగా రూ.15 వేల కోట్లకు పైగా నష్టాన్ని నమోదు చేసే అవకాశం ఉందని విషయానికి దగ్గరగా ఉన్న వర్గాలు చెబుతున్నాయి. ఈ నష్టాలతో ఎయిర్ ఇండియా టర్న్‌రౌండ్ దిశగా సాధించిన పురోగతి పూర్తిగా వెనక్కి వెళ్లినట్లైంది. టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ కలిసి నిర్వహిస్తున్నఈ విమానయాన సంస్థకు మరో దెబ్బ పాకిస్తాన్ నిర్ణయం. భారత్‌తో సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఎయిర్‌లైన్స్‌కు తమ గగనతలాన్ని మూసివేయడంతో, యూరప్,అమెరికా వెళ్లే విమానాలు ఎక్కువ దూరం తిరగాల్సి వచ్చింది.
వివరాలు
ఈ ఆర్థిక సంవత్సరంలో లాభాలు సాధించడం అసాధ్యం
దీంతో ఇంధనం, ఆపరేషన్ ఖర్చులు పెరిగి లాభాలపై మరింత భారమయ్యిందని వర్గాలు తెలిపాయి. జూన్‌లో జరిగిన డ్రీమ్‌లైనర్ ప్రమాదానికి ముందు ఎయిర్ ఇండియా మెల్లగా లాభాల దిశగా అడుగులు వేస్తోంది. అయితే 240 మందికిపైగా ప్రాణాలు తీసిన ఆ ప్రమాదం, సంస్థ సంవత్సరాలుగా చేసిన కృషిని ఒక్కసారిగా నీరుగార్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆపరేషన్ బ్రేక్‌ఈవెన్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, ఇప్పుడు లాభాలు సాధించడం అసాధ్యంగా మారిందని సమాచారం. ఇది మాత్రమే కాదు, గత ఏడాది భారత విమానయాన రంగం మొత్తం గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంది. ప్రయాణికుల్లో భయం, తరచూ విమాన ఆలస్యాలు, ఒక ప్రత్యర్థి ఎయిర్‌లైన్ భారీగా విమానాలు రద్దు చేయడం వంటి ఘటనలు రంగాన్ని కుదిపేశాయి.
వివరాలు
మూడు సంవత్సరాల్లోనే ఎయిర్ ఇండియా మొత్తం రూ.32,210 కోట్ల నష్టం
దీంతో దేశంలో ఉన్న ద్వంద్వ (డ్యూపోలీ) మార్కెట్ నిర్మాణంపై కూడా చర్చ మొదలైంది. ఎయిర్ ఇండియా, టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు ఈ నష్టాలపై స్పందించాలంటూ పంపిన ఈమెయిల్ అభ్యర్థనలకు సమాధానం ఇవ్వలేదని తెలిసింది. ఇదిలా ఉండగా, మేనేజ్‌మెంట్ సమర్పించిన కొత్త ఐదేళ్ల ప్రణాళికలో మూడో ఏడాదిలోనే లాభాలు వస్తాయని అంచనా వేశారు. కానీ బోర్డు ఆ ప్రణాళికను తిరస్కరించి, మరింత దూకుడైన టర్న్‌రౌండ్ ప్రణాళిక తీసుకురావాలని ఆదేశించింది. టాఫ్లర్ గణాంకాల ప్రకారం, గత మూడు సంవత్సరాల్లోనే ఎయిర్ ఇండియా మొత్తం రూ.32,210 కోట్ల నష్టాన్ని చవిచూసింది.
వివరాలు
ప్రస్తుత సీఈవో స్థానంలో కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ కోసం టాటా గ్రూప్ అన్వేషణ
గతేడాది కనీసం రూ.10 వేల కోట్ల తాజా మద్దతు కోరిందని అక్టోబర్‌లో బ్లూమ్‌బర్గ్ నివేదించింది. ఈ పెరుగుతున్న నష్టాలు ఇప్పుడు ఇరు భాగస్వాములకు ఆందోళనగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ స్థానంలో కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ కోసం టాటా గ్రూప్ అన్వేషణ ప్రారంభించినట్లు సమాచారం. అయితే ప్రమాదంపై నివేదిక విడుదలయ్యే వరకు ఈ నియామకం తుది దశకు చేరకపోవచ్చని అంటున్నారు. 2024లో విస్తారా విలీనంతో 25.1 శాతం వాటా తీసుకున్న సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కూ, ఎయిర్ ఇండియా పనితీరు కారణంగా లాభాలపై ప్రభావం పడింది. అదే సమయంలో పునర్వ్యవస్థీకరణలో భాగంగా విమానాల నిర్వహణను ఇంటర్నల్‌గా తీసుకురావడంలో మాత్రం సంస్థకు సహకరిస్తోంది.