LOADING...
Airlines letter to govt: పెరిగిన విమాన ఇంధన ధరలు.. ప్రభుత్వానికి విమాన సంస్థల లేఖ
పెరిగిన విమాన ఇంధన ధరలు.. ప్రభుత్వానికి విమాన సంస్థల లేఖ

Airlines letter to govt: పెరిగిన విమాన ఇంధన ధరలు.. ప్రభుత్వానికి విమాన సంస్థల లేఖ

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 28, 2026
04:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

పెరిగిపోతున్న విమాన ఇంధన ధరల కారణంగా సేవలను కొనసాగించడం కష్టసాధ్యమైందని విమానయాన సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి సంయుక్తంగా విజ్ఞప్తి చేశాయి. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేయడం లేదా పూర్తిగా మూసివేయాల్సిన పరిస్థితి తలెత్తుతుందని స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌ జెట్ సంస్థలతో కూడిన విమానయాన సంస్థల సమాఖ్య పౌర విమానయాన శాఖ కార్యదర్శికి మంగళవారం లేఖ రాసింది. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని ఉపశమన చర్యలు ప్రకటించాలని సమాఖ్య కోరింది.

వివరాలు 

తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నవిమాన సంస్థలు

విమానాల నిర్వహణ వ్యయాల్లో సుమారు నలభై శాతం ఇంధనానికి ఖర్చవుతుండటం, ఇటీవలి కాలంలో ఇంధన ధరలు అమాంతం పెరగడం వంటి కారణాలతో ఈ విజ్ఞప్తి చేసినట్లు పేర్కొంది. జెట్ ఇంధన ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో దేశీయ,విదేశీ విమాన సర్వీసులను నిర్వహించడం మరింత క్లిష్టంగా మారిందని సమాఖ్య లేఖలో తెలిపింది. ఇప్పటికే విమాన సంస్థలు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని గుర్తుచేసింది. ఇలాంటి సమయంలో ప్రభుత్వ మద్దతు లేకపోతే సేవలను మూసివేయడం తప్ప మరో మార్గం లేదని హెచ్చరించింది.

వివరాలు 

దేశీయ,విదేశీ కార్యకలాపాలకు ఒకే విధమైన ఇంధన ధర విధానం

ఉపశమన చర్యల భాగంగా ఇంధన ధరలను స్థిరంగా ఉంచే విధానాన్ని అమలు చేయాలని సంస్థలు కోరుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ విమాన ఇంధన ధరలు నియంత్రణలో ఉండేలా గతంలో అమలు చేసిన విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టాలని సూచించాయి. దేశీయ,విదేశీ కార్యకలాపాలకు ఒకే విధమైన ఇంధన ధర విధానం ఉండాలని కూడా కోరాయి. అలాగే విమాన ఇంధనంపై అమలులో ఉన్న పదకొండు శాతం కేంద్ర పన్నును పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి.

Advertisement