Air India: ఇంధన ధరల భారం.. అంతర్జాతీయ సర్వీసులకు ఎయిరిండియా కోత
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు భారీగా పెరుగుతుండటంతో విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. పెరుగుతున్న ఖర్చులను ఎదుర్కొనేందుకు టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రోజుకు దాదాపు 100 విమాన సర్వీసులను తగ్గించాలని సంస్థ నిర్ణయించింది. విమాన ఇంధన ధరలు అధికంగా పెరగడంతో వచ్చే జూన్ నుంచి మూడు నెలలపాటు పలు అంతర్జాతీయ విమానాల సంఖ్యను తగ్గించనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇందులో భాగంగా దిల్లీ నుంచి చికాగో, నెవార్క్, సింగపూర్, షాంఘై నగరాలకు నడిచే కొన్ని సర్వీసులను పూర్తిగా నిలిపివేసింది. అలాగే శాన్‌ఫ్రాన్సిస్కో, పారిస్, టొరంటో మార్గాల్లో విమానాల రాకపోకలను తగ్గించనున్నట్లు తెలిపింది.
వివరాలు
ఇంధన వినియోగంతో పాటు సిబ్బంది వ్యయాలు కూడా పెరిగాయి
విమాన ఇంధన ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో షెడ్యూళ్లలో కోత విధించడం తప్ప మరో మార్గం లేదని సంస్థ ప్రధాన కార్యనిర్వాహణ అధికారి క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. మరోవైపు పాకిస్థాన్ గగనతలం మూసివేయడంతో యూరప్, ఉత్తర అమెరికా దేశాలకు వెళ్లే విమానాలు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తోందన్నారు. దీనివల్ల ఇంధన వినియోగంతో పాటు సిబ్బంది వ్యయాలు కూడా గణనీయంగా పెరిగాయని చెప్పారు. విమానాల నిర్వహణ ఖర్చులను కూడా తిరిగి రాబట్టలేని పరిస్థితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరిన్ని అంతర్జాతీయ సర్వీసులపై కూడా కోతలు విధించే అవకాశం ఉందని వెల్లడించారు.