Airtel: ఎయిర్ ఫైబర్ విస్తరణలో ఎయిర్‌టెల్ దూకుడు.. నోకియాతో కొత్త ఒప్పందం!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ తన బ్రాడ్‌బ్యాండ్ సేవలను విస్తరించేందుకు సిద్ధమైంది.
దేశవ్యాప్తంగా హైస్పీడ్ 5జీ ఇంటర్నెట్ అందించేందుకు 5జీ ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ డివైజులు, వైఫై సొల్యూషన్స్ సరఫరా కోసం నోకియా, క్వాల్‌కామ్ సంస్థలతో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది.
ఈ డివైజులను పూర్తిగా భారత్‌లోనే తయారు చేయనున్నట్టు ఎయిర్‌టెల్ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే కాంట్రాక్ట్‌కు సంబంధించిన ఖచ్చితమైన వివరాలను కంపెనీ గోప్యంగా ఉంచింది.
దేశవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్ సేవల వినియోగం పెరుగుతున్నా ఫైబర్ కనెక్టివిటీ అంతగా విస్తరించలేదు.
దీని ఫలితంగా, జియో, ఎయిర్‌టెల్ వంటి దిగ్గజ టెలికాం సంస్థలు ఎయిర్‌ఫైబర్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి.
Details
నోకియాతో కలిసి 5జీ విస్తరణ
ఫైబర్‌నెట్ విస్తరించని ప్రాంతాల్లో వేగంగా బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించేందుకు ఎయిర్‌ఫైబర్ ముఖ్యపాత్ర పోషించనుంది.
ఈ సేవలను మరింత సమర్థవంతంగా విస్తరించేందుకు ఎయిర్‌టెల్ చేసిన తాజా ఒప్పందం ఉపయోగపడనుంది.
ఈ కాంట్రాక్టులో భాగంగా, ఫిక్స్‌డ్ వైర్‌లైన్ యాక్సెస్ ఔట్‌డోర్ రిసీవర్లు, వైఫై 6 యాక్సెస్ పాయింట్లను నోకియా అందించనుంది.
నోకియా సరఫరా చేసే ఫాస్ట్‌మైల్ 5జీ ఔట్‌డోర్ రిసీవర్లు ఒకటి కంటే ఎక్కువ యూనిట్లను కనెక్ట్ చేసుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి.
అంటే ఒకే యూనిట్ ద్వారా రెండు ఇళ్లకు కనెక్టివిటీ అందించవచ్చు. దీని ద్వారా సంస్థ ఖర్చులను తగ్గించుకోవచ్చు.
Details
6 యాక్సెస్ పాయింట్లు ఏర్పాటు
ఈ యూనిట్లు పవర్-ఓవర్-ఈథర్‌నెట్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తాయి. అంటే ప్రత్యేకంగా పవర్ సప్లై అవసరం ఉండదు.
ఇంటిలోని వైఫై యాక్సెస్ పాయింట్ల ద్వారా వచ్చే పవర్‌తోనే ఇవి పనిచేయగలవు.
దీని వల్ల గోడలు, బాల్కనీ, స్తంభాలు వంటి ప్రదేశాల్లో ఈ డివైజులను సులభంగా అమర్చవచ్చు.
ఇంటి లోపల భాగంలో నోకియా వైఫై 6 యాక్సెస్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు.
ఇవి పూర్తిగా రీసైకిల్ చేయదగిన మెటీరియల్‌తో తయారు చేసినవేనని నోకియా వెల్లడించింది.