New Form 130 : ఉద్యోగులకు అలర్ట్.. ఇకపై ఫామ్-16 స్థానంలో ఫామ్-130
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం జీతభత్యాలు పొందే ఉద్యోగుల పన్ను పత్రాల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. దశాబ్దాలుగా ఉపయోగంలో ఉన్న ఫామ్-16ను రద్దు చేసి, దాని స్థానంలో కొత్తగా ఫామ్-130ను ప్రవేశపెట్టింది. ఈ మార్పు 2026-27 ఆర్థిక సంవత్సరానికి అమల్లోకి రానుంది. ఏప్రిల్ 1తో ప్రారంభమైన కొత్త ఆర్థిక సంవత్సరంతో ఈ నిర్మాణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం.
వివరాలు
ఫామ్-16కు గుడ్‌బై.. ఫామ్-130కు స్వాగతం
ఇన్నాళ్లు ఉద్యోగుల పన్ను వివరాలకు ప్రామాణిక పత్రంగా ఉపయోగించిన ఫామ్-16 స్థానంలో ఇకపై ఫామ్-130 ప్రధాన పత్రంగా మారనుంది. అయితే పన్ను లెక్కింపు విధానంలో ఎలాంటి మార్పులుండవు. ఈ మార్పు కేవలం డిజిటల్ రిపోర్టింగ్‌ను మరింత ఖచ్చితంగా, పారదర్శకంగా చేయడానికే చేపట్టింది. ఉద్యోగి జీతం నుంచి కట్ అయ్యే ప్రతి రూపాయి ప్రభుత్వం డిజిటల్ రికార్డులతో సరిపోలేలా ఈ కొత్త ఫార్మాట్ రూపొందించారు.
వివరాలు
అమలు ఎప్పుడంటే?
ఈ మార్పు వెంటనే అమల్లోకి రాదు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను రిటర్న్ ఫైలింగ్ కోసం పాత ఫామ్-16నే ఉపయోగిస్తారు. సాధారణంగా జూన్ 2026లో ఉద్యోగులకు ఫామ్-16 జారీ అవుతుంది. కొత్త ఫామ్-130 మొదటిసారి 2026-27 ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తూ, 2027 జూన్ 15న విడుదల కానుంది. ఈ మధ్యకాలంలో సంస్థలు తమ పేరోల్ సిస్టమ్స్‌ను అప్‌డేట్ చేసుకునేందుకు సమయం కల్పించారు.
వివరాలు
ఫామ్-130 నిర్మాణం ఎలా ఉంటుంది?
ఫామ్-130లో ప్రధాన మార్పు దీని నిర్మాణంలోనే ఉంది. ఇది మూడు భాగాలుగా విభజించారు. పార్ట్ A : ఉద్యోగి పాన్, ట్యాన్ వివరాలు, ప్రాథమిక ట్యాక్స్ డిడక్షన్ సమాచారం పార్ట్ B : జీత నిర్మాణం, మినహాయింపులు, ప్రాథమిక పన్ను లెక్కలు పార్ట్ C : మొత్తం ఆదాయం, చెల్లించాల్సిన పన్ను, రిలీఫ్, TDS/TCS సర్దుబాట్లపై పూర్తి వివరాలు ఈ విధంగా విభజించడం ద్వారా ఉద్యోగి ఆర్థిక స్థితిపై స్పష్టమైన అవగాహనతో పాటు, ఎలాంటి పొరపాట్లు లేకుండా ఆడిట్ ట్రైల్ అందుబాటులో ఉంటుంది.
వివరాలు
పూర్తిగా డిజిటల్ విధానం
ఫామ్-130 పూర్తిగా డిజిటల్ రూపంలోనే జారీ అవుతుంది. ఉద్యోగులు TRACES పోర్టల్‌లో త్రైమాసిక రిటర్నులు సమర్పించిన తర్వాత మాత్రమే ఈ ఫామ్ రూపొందుతుంది. దీంతో ఉద్యోగి చేతిలో ఉన్న పత్రం, ప్రభుత్వ డేటాతో పూర్తిగా సరిపోతుంది. పెన్షనర్లు, సీనియర్ సిటిజన్లకూ వర్తింపు ఈ కొత్త విధానం ఉద్యోగులతో పాటు పెన్షనర్లు, వడ్డీ ఆదాయం పొందే కొంతమంది సీనియర్ సిటిజన్లకూ వర్తిస్తుంది. దీంతో పన్ను రిపోర్టింగ్ వ్యవస్థను మరింత విస్తృతంగా, సమగ్రంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
వివరాలు
సంస్థలకు సవాళ్లు
ఈ వ్యవస్థలో పూర్తిగా డిజిటల్ ఆధారిత విధానం ఉండటంతో, ఉద్యోగదారులపై బాధ్యత పెరుగుతుంది. త్రైమాసిక రిటర్నుల్లో ఆలస్యం లేదా పొరపాట్లు జరిగితే ఫామ్-130 జారీ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త వ్యవస్థతో పన్ను లెక్కింపు విధానం మారదు. కానీ పన్ను వివరాల నివేదికను మరింత స్పష్టంగా, ఖచ్చితంగా, డిజిటల్‌గా మార్చడమే లక్ష్యం. దీని ద్వారా పొరపాట్లు తగ్గి, పన్ను వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు.