Amazon Layoffs: అమెజాన్‌లో మరోసారి 1000 ఉద్యోగాల కోత.. భారత్‌లోనూ ప్రభావం
ఈ వార్తాకథనం ఏంటి
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో విడత ఉద్యోగుల తొలగింపులకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. కంపెనీ స్టోర్స్ విభాగంలో దాదాపు 1,000లోపు వైట్‌కాలర్ ఉద్యోగాలను తగ్గించినట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రధాన ఆన్‌లైన్ షాపింగ్ కార్యకలాపాలను ఈ విభాగమే పర్యవేక్షిస్తుంది. తాజా లేఆఫ్స్‌లో అమెరికాతో పాటు బ్రిటన్, భారత్ కేంద్రంగా పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ప్రభావితమైనట్లు కంపెనీ అంతర్గత స్లాక్ ఛానళ్లలో వచ్చిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం అమెజాన్ నిర్వహిస్తున్న కీలక షాపింగ్ సేల్ సమయంలోనే ఈ ఉద్యోగాల కోతలు వెలుగులోకి రావడం గమనార్హం. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ప్రైమ్ బిగ్ డీల్ డేస్ వంటి సేల్స్‌లో భాగంగా ఎలక్ట్రానిక్స్ సహా పలు ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది.
వివరాలు
ఇప్పటికే 30 వేల మందికి పైగా ఉద్యోగాలపై ప్రభావం
ఇలాంటి సమయంలో లేఆఫ్స్ ప్రకటన రావడం చర్చనీయాంశంగా మారింది.
అయితే ఎంతమంది ఉద్యోగులను తొలగించారనే ఖచ్చితమైన సంఖ్యను అమెజాన్ వెల్లడించలేదు.
స్టోర్స్ వ్యాపార అవసరాలు, ప్రాధాన్యాలకు అనుగుణంగా సంస్థను పునర్‌వ్యవస్థీకరిస్తున్నామని కంపెనీ ప్రతినిధి తెలిపారు.
తాజా ఉద్యోగ కోతలు అమెజాన్ చేపడుతున్న పునర్‌వ్యవస్థీకరణలో మరో దశగా భావిస్తున్నారు.
గతేడాది చివరి నుంచి సంస్థ ఉద్యోగుల సంఖ్యను తగ్గించే చర్యలు కొనసాగిస్తోంది. ఇప్పటివరకు దాదాపు 30 వేల మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం.
గతేడాది చివర్లో సుమారు 14 వేల మంది ఉద్యోగులను తొలగించగా.. 2026 జనవరిలో మరో 16 వేల మందికి పైగా ఉద్యోగులపై వేటు పడినట్లు వార్తలు వచ్చాయి.
వివరాలు
ఏఐ వినియోగం పెరగడంతో మారుతున్న ఉద్యోగాల స్వరూపం
సంస్థ కార్యకలాపాలను మరింత సమర్థంగా, తక్కువ వ్యయంతో నిర్వహించేందుకు ఈ మార్పులు చేపడుతున్నట్లు అమెజాన్ చెబుతోంది.
వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్య, విభాగాల నిర్మాణాన్ని సర్దుబాటు చేస్తున్నట్లు పేర్కొంటోంది.
అమెజాన్ కొంతకాలంగా తన కార్యకలాపాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగాన్ని వేగంగా పెంచుతోంది.
దీనివల్ల కొన్ని విభాగాల్లో ఉద్యోగుల పనితీరుపై ప్రభావం పడుతోంది.
సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, డీబగ్గింగ్, సిస్టమ్ మెయింటెనెన్స్ వంటి రోజువారీ, సాధారణ పనుల్లోనూ ఏఐ ఆధారిత టూల్స్ వినియోగం పెరుగుతోంది.
దీంతో ఇంజినీర్లు రొటీన్ పనులపై కాకుండా సిస్టమ్ ఆర్కిటెక్చర్, క్లిష్టమైన సాంకేతిక సమస్యల పరిష్కారం వంటి కీలక అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టే పరిస్థితి ఏర్పడుతోంది.
వివరాలు
ఏఐ, మెషీన్ లెర్నింగ్ నిపుణులకు మాత్రం అవకాశాలు
అయితే అమెజాన్ పూర్తిగా నియామకాలను నిలిపివేయలేదు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటి వ్యూహాత్మక విభాగాల్లో నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కోసం నియామకాలు కొనసాగుతున్నాయి.
అంతేకాదు.. ఇటీవల కంపెనీని వీడిన కొందరు మాజీ ఉద్యోగులను తిరిగి సంస్థలోకి తీసుకునేందుకు కూడా అమెజాన్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
మాజీ ఉద్యోగుల్లోనూ ఏఐ, మెషీన్ లెర్నింగ్ నైపుణ్యాలు ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే అమెజాన్ వ్యవస్థ, పని విధానాలు, అంతర్గత ప్రక్రియలపై అవగాహన ఉన్నవారిని తిరిగి తీసుకోవడం ద్వారా కొత్తగా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం తగ్గుతుందని కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం.
అదే సమయంలో ఏఐ విభాగాల్లో ఉన్న నైపుణ్యాల కొరతను కూడా ఈ విధంగా అధిగమించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
కరోనా సమయంలో అవసరానికి మించి నియామకాలు
కరోనా మహమ్మారి సమయంలో ప్రజలు పెద్దఎత్తున ఆన్‌లైన్ షాపింగ్‌కు మారడంతో అమెజాన్ వ్యాపారానికి భారీగా డిమాండ్ ఏర్పడింది.
ఆ పెరిగిన డిమాండ్‌ను అందుకునేందుకు అప్పట్లో సంస్థ అవసరానికి మించి ఉద్యోగులను నియమించుకున్నట్లు అమెజాన్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జెఫ్ బెజోస్ గతంలో పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆన్‌లైన్ షాపింగ్ డిమాండ్ కొంత తగ్గడంతో పాటు కంపెనీ కార్యకలాపాల్లో ఏఐ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం తప్పనిసరి అవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.