LOADING...
Amazon: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఖర్చులు పెరగడంతో.. అమెజాన్‌లో 14 వేల ఉద్యోగాలకు కోత 
అమెజాన్‌లో 14 వేల ఉద్యోగాలకు కోత

Amazon: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఖర్చులు పెరగడంతో.. అమెజాన్‌లో 14 వేల ఉద్యోగాలకు కోత 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 28, 2025
04:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ ప్రఖ్యాత ఇ-కామర్స్ సంస్థ అమెజాన్‌ (Amazon) మరోసారి పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమవుతోంది. సుమారు 14 వేల కార్పొరేట్ ఉద్యోగాలను తగ్గించనున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టడం వల్ల, సంస్థలో వనరుల వినియోగాన్ని సవరించే చర్యల భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇంతకుముందు దాదాపు 30 వేల మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందన్న ప్రచారాల నేపథ్యంలో అమెజాన్‌ ఈ అధికారిక ప్రకటన వెలువరించింది.

వివరాలు 

అమెజాన్‌ కొత్త దిశగా అడుగులు

ఉద్యోగులకు పంపిన మెమోలో, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గలెట్టి మాట్లాడుతూ.. "ప్రస్తుత, భవిష్యత్ కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అమెజాన్‌ కొత్త దిశగా అడుగులు వేస్తోంది. ఈ ప్రక్రియలో బ్యూరోక్రసీని తగ్గించి, అవసరం లేని స్థాయిలను (లేయర్లను) తొలగిస్తూ, వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకునే విధంగా చర్యలు చేపడుతున్నాం" అని వివరించారు. అలాగే గతంలో సీఈఓ యాండీ జెస్సీ ఉద్యోగులకు రాసిన లేఖను కూడా ఈ మెమోకు జత చేశారు. లేఆఫ్‌ల ప్రభావం పడే ఉద్యోగులకు,వారి బృందాలకు త్వరలోనే అధికారిక సమాచారం అందజేయనున్నట్లు తెలిపారు.

వివరాలు 

రికరాలు, కమ్యూనికేషన్, పాడ్‌కాస్టింగ్ వంటి విభాగాల్లో కొత్త 

మొదట 'రాయిటర్స్‌' వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, అమెజాన్‌లో పనిచేస్తున్న 3.5 లక్షల కార్పొరేట్ ఉద్యోగుల్లో సుమారు 10 శాతం మంది (దాదాపు 30 వేల మంది) తొలగించబడే అవకాశం ఉందని చెప్పింది. ఈ నేపథ్యంలోనే అమెజాన్‌ అధికారిక ప్రకటన ఇచ్చింది. గత రెండేళ్లుగా సంస్థ పరికరాలు, కమ్యూనికేషన్, పాడ్‌కాస్టింగ్ వంటి విభాగాల్లో కూడా ఉద్యోగులను తగ్గిస్తూ వస్తోంది. అమెజాన్‌ సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి యాండీ జెస్సీ ఉద్యోగాల కోతల నిర్ణయాలను దశలవారీగా అమలు చేస్తున్నారు. ప్రస్తుత కాలాన్ని ఆయన తరచూ "ఏఐ యుగం (AI Era)"గా అభివర్ణిస్తూ, సంస్థ దిశ కూడా దానికి అనుగుణంగా మారుతోందని పేర్కొన్నారు.