Amazon Investment in India: అమెజాన్ సాహసోపేత నిర్ణయం...భారత్‌లో భారీ పెట్టుబడులకు సిద్దం
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో పునరుత్పాదక ఇంధన రంగానికి మరింత ఊతమిచ్చేలా అమెజాన్ భారీ ప్రణాళికను ప్రకటించింది. 2030 నాటికి దేశంలోని పవన, సౌర విద్యుత్ ప్రాజెక్టులపై అదనంగా రూ.65,393 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే భారత్‌లో కుదుర్చుకున్న సుమారు రూ.37 వేల కోట్ల ఒప్పందాలకు ఇది అదనం. ఈ నిర్ణయంతో దేశంలో స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తికి అంతర్జాతీయ సంస్థల నుంచి వస్తున్న మద్దతు మరింత పెరగనుంది. తన వ్యాపార కార్యకలాపాలకు అవసరమైన విద్యుత్‌లో పునరుత్పాదక వనరుల వాటాను పెంచుకోవడమే అమెజాన్ లక్ష్యంగా కనిపిస్తోంది.
Details
నాలుగు కొత్త ప్రాజెక్టులతో 934 మెగావాట్ల విద్యుత్
ఈ పెట్టుబడుల్లో భాగంగా మొత్తం 934 మెగావాట్ల సామర్థ్యంతో నాలుగు కొత్త పవన, సౌర విద్యుత్ ప్రాజెక్టులను అమెజాన్ ప్రకటించింది.
కర్ణాటకలో 234 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టుతో పాటు 200 మెగావాట్ల సౌర-పవన మిశ్రమ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది.
మధ్యప్రదేశ్‌లో 300 మెగావాట్లు, రాజస్థాన్‌లో 200 మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్రాజెక్టులు రానున్నాయి.
వీటిలో కర్ణాటక ప్రాజెక్టు ఆసియాలోనే అతిపెద్ద పవన విద్యుత్ ప్రాజెక్టుగా నిలవనుందని సంస్థ పేర్కొంది.
Details
35 లక్షల కుటుంబాలకు సరిపడా విద్యుత్
ఈ ప్రాజెక్టులు పూర్తిగా అందుబాటులోకి వస్తే భారత్‌లో అమెజాన్ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 2 గిగావాట్లకు చేరుకుంటుంది.
ఇది 35 లక్షలకు పైగా కుటుంబాల ఏడాది విద్యుత్ అవసరాలకు సరిపడా ఉత్పత్తి చేయగలదని సంస్థ చీఫ్ సస్టైనబిలిటీ ఆఫీసర్ కారా హర్స్ట్ తెలిపారు.
విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ద్వారా ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే కుదిరిన 4 బిలియన్ డాలర్ల ఒప్పందాల్లో ఇవి భాగమని ఆమె వివరించారు.
Details
నెట్-జీరో లక్ష్యానికి మరో అడుగు
అమెజాన్ 2030 నాటికి తన కార్యకలాపాల విద్యుత్ వినియోగంలో కర్బన ఉద్గారాల తీవ్రతను 65 శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2040 నాటికి నెట్-జీరో కార్బన్ స్థాయికి చేరుకోవాలన్నది సంస్థ దీర్ఘకాలిక ప్రణాళిక. ఈ పెట్టుబడులు ఆ దిశగా కీలకంగా మారనున్నాయి.
భారత క్లీన్ ఎనర్జీ రంగంపై అంతర్జాతీయ కంపెనీలకు నమ్మకం పెరుగుతోందనడానికి అమెజాన్ నిర్ణయం నిదర్శనమని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు.