
Robots in Amazon: అమెజాన్‌లో రోబోలు.. లక్షల మంది కార్మికుల స్థానంలో!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ వ్యాప్తంగా అత్యాధునిక సాంకేతికతను అవలంబిస్తున్న బహుళజాతి కంపెనీలు కృత్రిమ మేధ (Artificial Intelligence), ఆటోమేషన్ వంటి సాంకేతిక పరిజ్ఞానాలపై దృష్టి సారించాయి. దీని ద్వారా మానవ వనరుల ఖర్చును గణనీయంగా తగ్గించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా రాబోయే రోజుల్లో రోబోలను విస్తృతంగా ఉపయోగించడానికి సిద్ధమవుతోందని తెలుస్తోంది. 2027 నాటికి సుమారు 1.6 లక్షల మంది కార్మికులను నియమించడమే కాకుండా, ఈ ఖాళీలను రోబోాలతో భర్తీ చేయడం పై దృష్టి పెట్టినట్లు తెలిసింది. అంతర్జాతీయ మీడియా, లీక్ అయిన సంస్థ పత్రాలను ఆధారంగా ఈ వార్తలు వెలువడ్డాయి.
వివరాలు
2027 నాటికి 1.6 లక్షల మంది కార్మికులను నియమించాల్సిన అవసరం ఉండదు
న్యూయార్క్ టైమ్స్ తెలిపిన ప్రకారం, అమెజాన్ వేర్‌హౌస్‌లలో ఇప్పటికే భారీగా రోబోలను ఉపయోగిస్తోంది. రాబోయే కాలంలో వీటిని మరింత విస్తరించేందుకు రోబోటిక్స్ బృందం 75% కార్యకలాపాలను ఆటోమేషన్ చేయడానికి పని చేస్తోందని తెలిపింది. ఇది నిజమైతే 2027 నాటికి 1.6 లక్షల మంది కార్మికులను నియమించాల్సిన అవసరం ఉండదు. 2033 నాటికి ప్రస్తుత వస్తువుల అమ్మకాన్ని రెట్టింపు చేయాలని యోచిస్తున్న ఈ-కామర్స్ దిగ్గజం, అదే సమయంలో సుమారు 6 లక్షల మంది ఉద్యోగాల అవసరం లేకుండా రోబోలను ఉపయోగించి కార్యకలాపాలను నడిపించుకునే ప్రణాళికలు వేసిందని వార్తలు పేర్కొన్నాయి. ఈ వ్యూహాలను కంపెనీ పత్రాలు, మీడియా ప్రకటనలు పరిశీలించిన తరువాత తెలిసినట్టు సమాచారం.
వివరాలు
2.5లక్షల మందిని నియమించుకునే ప్రణాళిక
అయితే, తాజా వార్తలపై అమెజాన్ ప్రతినిధి కెల్లీ నాంటెల్ స్పందించారు. ఒక వార్తా సంస్థతో మాట్లాడిన సందర్భంలో, లీక్ అయిన పత్రాలు ఒక నిర్దిష్ట బృంద అభిప్రాయాలను మాత్రమే సూచిస్తున్నాయని, మొత్తం సంస్థ ప్రణాళికను ప్రతిబింబించవని స్పష్టం చేశారు. వాటిలో పూర్తి వివరాలు లేవని, కొన్ని సందర్భాల్లో ప్రణాళిక తప్పుదారి పట్టే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అనేక విభాగాల మధ్య నిత్యం వేలాది పత్రాలు సర్క్యులేట్ అవుతుంటాయని గుర్తుచేశారు. అలాగే, అమెరికా లోని వివిధ కేంద్రాల్లో క్రమంగా నియామకాలు కొనసాగుతున్నాయని, రాబోయే హాలీడే సీజన్లో దాదాపు 2.5 లక్షల మందిని నియమించడానికి ప్రణాళికలున్నాయని అమెజాన్ ప్రతినిధి వెల్లడించారు.