Amazon: అమెజాన్ మరోసారి భారీ లేఆఫ్స్.. 30 వేల మంది ఉద్యోగులకు షాక్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ ప్రఖ్యాత ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon)మళ్లీ భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈసారి సంస్థలో సుమారు 30,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించిందని పలు మీడియా కథనాలు చెబుతున్నాయి. 2022 చివరి నుంచి ఇప్పటివరకు దాదాపు 27,000మంది ఉద్యోగులను అమెజాన్ ఇప్పటికే తొలగించింది. అయితే తాజాగా తీసుకుంటున్న ఈ నిర్ణయం కంపెనీ చరిత్రలోనే అత్యంత పెద్ద స్థాయి లేఆఫ్‌గా నిలవనుందని సమాచారం. ప్రస్తుతం అమెజాన్‌లో సుమారు 3.5 లక్షల మంది కార్పొరేట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇది సంస్థ మొత్తం ఉద్యోగుల్లో సుమారు 10శాతం.వ్యయాలను తగ్గించే వ్యూహంలో భాగంగా ఈ భారీ ఉద్యోగాల కోత చేపడుతున్నట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
వివరాలు
ఆయా విభాగాల మేనేజర్లకు కంపెనీ ప్రత్యేక శిక్షణ
గత రెండు సంవత్సరాలుగా అమెజాన్ పరికరాలు,కమ్యూనికేషన్,పాడ్‌కాస్టింగ్ వంటి విభాగాల్లో సిబ్బందిని తగ్గిస్తూ వస్తోంది. తాజా నిర్ణయంతో హ్యూమన్ రిసోర్సెస్ (మానవ వనరులు),పీపుల్ ఎక్స్‌పీరియెన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే పరికరాలు,సేవలు వంటి విభాగాలు కూడా ప్రభావితమయ్యే అవకాశముంది. ఈ తొలగింపులకు సంబంధించి ఉద్యోగులతో ఎలా కమ్యూనికేట్ చేయాలి,ఏ విధంగా సమాచారం ఇవ్వాలి అనే అంశాలపై ఆయా విభాగాల మేనేజర్లకు కంపెనీ ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలుస్తోంది.
వివరాలు
ప్రస్తుతం మనం కృత్రిమ మేధస్సు (AI) శకంలో ఉన్నాం
వచ్చే వారం దాదాపు వెయ్యి మందికి తొలగింపు నోటీసులు అందే అవకాశముందని ఒక ప్రతినిధి వెల్లడించారు. ప్రభావితుల్లో మిన్నియాపాలిస్‌లోని అమెజాన్ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులే ఎక్కువమంది ఉన్నట్లు సమాచారం. అమెజాన్ సీఈఓగా యాండీ జెస్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచే సంస్థలో ఉద్యోగాల కోత కొనసాగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన పలుమార్లు "ప్రస్తుతం మనం కృత్రిమ మేధస్సు (AI) శకంలో ఉన్నాం" అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.