Nvidia: అమెరికాలో ఉద్యోగాల కోతల మధ్య హెచ్-1బీ ఉద్యోగులకు ఎన్‌విడియా గుడ్‌న్యూస్.. రూ.4.64 కోట్ల వరకు వేతనాలు!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని టెక్ రంగంలో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్న సమయంలో భారతీయ ఐటీ నిపుణులకు నివిడియా (Nvidia) సంస్థ ఆశాకిరణంగా మారింది. గత ఏడాదిగా అమెరికాలో పని చేస్తున్న వేలాది మంది భారతీయ టెకీ ఉద్యోగ భద్రతపై ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే హెచ్-1బీ వీసాపై ఉన్న ఉద్యోగి ఉద్యోగం కోల్పోతే, మరో సంస్థలో ఉద్యోగం సంపాదించుకోవడానికి కేవలం 60 రోజుల గడువు మాత్రమే ఉంటుంది. ఆ సమయంలో కొత్త స్పాన్సర్ దొరకకపోతే అమెరికాను వీడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కృత్రిమ మేధ (AI) రంగంపై దృష్టి పెంచుతున్న నేపథ్యంలో మెటా,గూగుల్,అమెజాన్ వంటి ప్రముఖ టెక్ కంపెనీలు నియామకాలను తగ్గించగా,కొన్ని సంస్థలు ఉద్యోగులను తొలగించాయి.
వివరాలు
హెచ్-1బీ ఉద్యోగుల నియామకాలను పెంచుతున్న ఎన్‌విడియా
అయితే ఈ పరిస్థితుల్లో ఎన్‌విడియా మాత్రం విదేశీ ప్రతిభకు అవకాశాలు కల్పిస్తూ హెచ్-1బీ ఉద్యోగుల నియామకాలను పెంచుతోంది. తాజా ఫెడరల్ రికార్డుల ప్రకారం, 2026 ఆర్థిక సంవత్సరపు తొలి రెండు త్రైమాసికాల్లో ఎన్‌విడియా సుమారు 1,200 హెచ్-1బీ పోస్టులకు అనుమతులు పొందింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య దాదాపు 1,000గా ఉండటం గమనార్హం. మరోవైపు గూగుల్‌లో హెచ్-1బీ ఆమోదాలు 5,100 నుంచి 2,200కు తగ్గగా, అమెజాన్‌లో 6,100 నుంచి 4,300కు పడిపోయినట్లు నివేదికలు వెల్లడించాయి.
వివరాలు
భారతీయ ఇంజినీర్లకే అత్యధికంగా లాభం చేకూరే అవకాశం
అమెరికాలో హెచ్-1బీ వీసాలపై పనిచేస్తున్న వారిలో 71 నుంచి 73 శాతం వరకు భారతీయులే ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. దీంతో హెచ్-1బీ నియామకాలు పెరిగితే భారతీయ ఇంజినీర్లకే అత్యధికంగా లాభం చేకూరే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏఐ విప్లవానికి కేంద్రబిందువుగా మారిన ఎన్‌విడియా సంస్థలో ఉద్యోగాల కోసం భారీగా పోటీ నెలకొంది. చాట్‌జీపీటీ తరహా ఏఐ మోడళ్ల నుంచి భారీ డేటా సెంటర్ల వరకు ఎన్‌విడియా చిప్‌లే కీలక పాత్ర పోషిస్తున్నాయి. విదేశీ ప్రతిభ కంపెనీ అభివృద్ధికి కీలకమని ఎన్‌విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ పలుమార్లు పేర్కొన్నారు. తైవాన్‌లో జన్మించిన ఆయన కూడా వలసదారుడే కావడం విశేషం.
వివరాలు
ఆకర్షణీయమైన ప్యాకేజీలు
వేతనాల విషయానికి వస్తే ఎన్‌విడియా ఆకర్షణీయమైన ప్యాకేజీలను అందిస్తోంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఏడాదికి గరిష్ఠంగా 3.72 కోట్ల రూపాయలు,రీసెర్చ్ సైంటిస్టులకు 3.39 కోట్ల రూపాయలు, ప్రొడక్ట్ మేనేజర్లకు 3.61 కోట్ల రూపాయల వరకు ప్రాథమిక వేతనం లభించవచ్చు. హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ మేనేజర్లకు సుమారు 3.50 కోట్ల రూపాయల వరకు జీతం అందుతోంది. డైరెక్టర్ స్థాయి ఉద్యోగాల్లో మరింత భారీ వేతనాలు ఉన్నాయి. ఆర్కిటెక్చర్ డైరెక్టర్లకు ఏడాదికి 4.64 కోట్ల రూపాయల వరకు ప్రాథమిక వేతనం లభించనుంది. అలాగే డిస్టింగ్విష్డ్ ఏఐ ఆల్గోరిథమ్స్ ఇంజినీర్లకు 4.48 కోట్ల రూపాయలు, ప్రిన్సిపల్ సిస్టమ్స్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు 4.10 కోట్ల రూపాయల వరకు జీతాలు అందుతున్నాయి.
వివరాలు
భారీ స్థాయిలో నియామకాలు చేపడుతున్నఎన్‌విడియా
ఏఐ పరిశోధన, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, చిప్ డిజైన్, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కస్టమర్ టెక్నికల్ సపోర్ట్ వంటి విభాగాల్లో ఎన్‌విడియా భారీ స్థాయిలో నియామకాలు చేపడుతోంది. అయితే హెచ్-1బీ వ్యవస్థపై నియంత్రణలు, కఠిన నిబంధనలు, పెరుగుతున్న వ్యయాల కారణంగా ఇతర కంపెనీలు విదేశీ ఉద్యోగుల నియామకాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. అయినప్పటికీ ఉద్యోగాల కోతలు, వీసా అనిశ్చితి మధ్య భారతీయ టెకీలకు ఎన్‌విడియా తాజా నియామకాలు కొత్త అవకాశాల తలుపులు తెరిచినట్లయ్యాయి.