Loading...
Amitabh Kant: టైగర్ గ్లోబల్ తీర్పు ప్రభావం.. రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ ఎత్తేయాలి: అమితాబ్ కాంత్
టైగర్ గ్లోబల్ తీర్పు ప్రభావం.. రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ ఎత్తేయాలి: అమితాబ్ కాంత్

Amitabh Kant: టైగర్ గ్లోబల్ తీర్పు ప్రభావం.. రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ ఎత్తేయాలి: అమితాబ్ కాంత్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 21, 2026
04:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

టైగర్ గ్లోబల్ పన్ను కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల విశ్వాసంపై ప్రతికూల ప్రభావం చూపిందని నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ అభిప్రాయపడ్డారు. దేశంలో పెట్టుబడులు పెరగాలంటే రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్(గత తేదీల నుంచి అమలు చేసే పన్ను విధానం)పూర్తిగా రద్దు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కెనడాకు చెందిన ఫెయిర్‌ఫ్యాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌లో సీనియర్ అడ్వైజర్‌గా ఉన్న అమితాబ్ కాంత్,మనీకంట్రోల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ ప్రపంచ పెట్టుబడిదారులకు అనుకూల దేశమనే సందేశం వెళ్లాలంటే పన్ను విధానంలో స్థిరత్వం తప్పనిసరి అని ఆయన అన్నారు.

వివరాలు 

మూలధన లాభాలపై భారత్‌లో పన్ను

"టైగర్ గ్లోబల్ కేసు పెట్టుబడిదారుల భావోద్వేగాలపై ప్రభావం చూపింది. రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ విధానాన్ని పూర్తిగా తొలగించడం దేశానికి ఒక లక్ష్యంగా మారాలి" అని వ్యాఖ్యానించారు.

2018లో అమెరికాకు చెందిన పెట్టుబడి సంస్థ టైగర్ గ్లోబల్, ఫ్లిప్‌కార్ట్‌లోని 1.6 బిలియన్ డాలర్ల విలువైన వాటాను వాల్‌మార్ట్‌కు విక్రయించింది.

ఈ లావాదేవీ ద్వారా వచ్చిన మూలధన లాభాలపై భారత్‌లో పన్ను వర్తిస్తుందని ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

ఈ లావాదేవీలు పన్ను ఎగవేత కోసం రూపొందించినవేనని, చట్టబద్ధమైన పన్ను ప్రణాళికగా పరిగణించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.

దీంతో పన్ను ప్రయోజనాల కోసం జరిగిన గత లావాదేవీలపై కూడా దర్యాప్తు చేసే అవకాశాలు పన్ను అధికారులకు లభించాయి.

వివరాలు 

FDI పెరగాలంటే..

భారత్ వేగంగా అభివృద్ధి చెందాలంటే విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించడం అవసరమని అమితాబ్ కాంత్ అన్నారు.

దేశీయ పొదుపులు మాత్రమే సరిపోవని,పెట్టుబడి-జీడీపీ నిష్పత్తి ప్రస్తుతం 30శాతంగా ఉండగా,దానిని 40 శాతానికి పెంచితేనే వచ్చే మూడు దశాబ్దాల పాటు భారత్ 9 శాతం ఆర్థిక వృద్ధిని సాధించగలదని ఆయన వివరించారు.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) పెరగాలంటే పన్ను విధానంలో స్థిరత్వంతో పాటు అడ్వాన్స్ రూలింగ్స్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.

ప్రస్తుతం ఈ నిర్ణయాలకు ఎక్కువ సమయం పడుతోందని, వాటిని గరిష్ఠంగా 60 రోజుల్లో పూర్తి చేసే విధంగా గడువు నిర్ణయించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

భవిష్యత్ లావాదేవీలపై ముందుగానే చట్టబద్ధమైన పన్ను స్పష్టత లభిస్తే, తర్వాత వివాదాలు తలెత్తే అవకాశాలు తగ్గుతాయని చెప్పారు.

ADVERTISEMENT

వివరాలు 

భారత్-చైనా సంబంధాలపై అమితాబ్ కాంత్

భారత్-చైనా సంబంధాలపై కూడా అమితాబ్ కాంత్ స్పందించారు.

బ్యాటరీలు, సోలార్ పరికరాలు, యంత్రాల తయారీ, కీలక విడిభాగాల ఉత్పత్తి వంటి రంగాల్లో చైనాతో భారత్ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

అయితే సాంకేతికతను లేదా సరఫరా వ్యవస్థలను చైనా ఆయుధంగా మార్చుకునే పరిస్థితి రాకుండా భారత్ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ADVERTISEMENT