Amul Milk:పెరిగిన అమూల్ పాల ధర..దేశవ్యాప్తంగా నేటి నుండి కొత్త రేటు
లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందు అమూల్ పాలు ఖరీదైనవిగా మారాయి. మొత్తం నిర్వహణ ఖర్చులు,పాల ఉత్పత్తి ఖర్చులు పెరిగిన నేపథ్యంలో సోమవారం నుంచి అన్ని రకాల అమూల్ పాల ధరలను లీటరుకు రూ.2పెంచినట్లు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్(జీసీఎంఎంఎఫ్)తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని మార్కెట్లలో అమూల్ మిల్క్ పౌచ్ ధర లీటరుకు రూ.2పెరగనుంది. GCMMF అమూల్ బ్రాండ్ క్రింద పాలు,పాల ఉత్పత్తులను మార్కెట్ చేస్తుంది. అమూల్ బ్రాండ్‌తో కూడిన అన్ని రకాల పాలపై లీటరుకు రూ.2చొప్పున పెంచినట్లు జీసీఎంఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ జయన్ మెహతా తెలిపారు. GCNMF చివరిసారిగా ఫిబ్రవరి 2023లో పాల ధరను పెంచింది.రైతులు తమ పెరిగిన ఉత్పత్తి ఖర్చులను భర్తీ చేసేందుకు ఈ పెంపుదల అవసరమని మెహతా అన్నారు.
పాల ఉత్పత్తి వ్యయం పెరగడంతో ధరలు పెంపు
తాజా పెంపుతో, 500 ml అమూల్ బఫెలో దూద్, 500 ml అమూల్ గోల్డ్ దూద్, 500 ml అమూల్ శక్తి దూద్ వంటి పాల ధరలు వరుసగా రూ.36, రూ.33, రూ.30గా ఉన్నాయి. లీటరుకు రూ.2 పెరగడం వల్ల ఎంఆర్‌పి 3-4 శాతం పెరిగిందని, ఇది సగటు ఆహార ద్రవ్యోల్బణం కంటే చాలా తక్కువగా ఉందని జిసిఎంఎంఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. అమూల్ ఫిబ్రవరి 2023 నుండి కీలక మార్కెట్లలో తాజా పౌచ్ పాల ధరలను పెంచలేదని గమనించాలి. మొత్తం నిర్వహణ వ్యయం, పాల ఉత్పత్తి వ్యయం పెరగడంతో ధరలు పెంచుతున్నారు.
80 పైసలు ఉత్పత్తిదారులకు
GCMMF ప్రకారం,అమూల్ ఒక పాలసీగా పాలు, పాల ఉత్పత్తుల కోసం వినియోగదారులు చెల్లించే ప్రతి రూపాయిలో దాదాపు 80 పైసలను ఉత్పత్తిదారులకు చెల్లిస్తుంది. ధరల సవరణ మన పాల ఉత్పత్తిదారులకు లాభదాయకమైన పాల ధరలను నిర్వహించడంలో సహాయపడుతుందని,మరింత పాలను ఉత్పత్తి చేయడానికి వారిని ప్రోత్సహిస్తుందని, ప్రకటన పేర్కొంది.