Page Loader
CEO fires Employees: మీటింగ్ కి అటెండ్ కాలేదని.. 99మంది ఉద్యోగులను తొలగించిన సీఈఓ 
మీటింగ్ కి అటెండ్ కాలేదని.. 99మంది ఉద్యోగులను తొలగించిన సీఈఓ

CEO fires Employees: మీటింగ్ కి అటెండ్ కాలేదని.. 99మంది ఉద్యోగులను తొలగించిన సీఈఓ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 18, 2024
10:33 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాకు చెందిన ఓ మ్యూజిక్ కంపెనీ సీఈఓ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. తాను నిర్వహించిన సమావేశానికి హాజరుకాకపోవడంతో ఏకంగా 99 మంది ఉద్యోగులను తొలగించారు. మొత్తం కంపెనీలో 111 మంది ఉద్యోగులుంటే, వారిలో ఎక్కువ మందిపై ఈ భారీ తొలగింపు చర్య చేపట్టారు. ఈ విషయం ఆ సంస్థలో పనిచేసే ఒక ఇంటర్న్ (తాత్కాలిక ఉద్యోగి) సోషల్ మీడియాలో చేసిన పోస్టు ద్వారా బయటపడింది, వెంటనే వైరల్‌గా మారింది. వైరల్ గా మారిన సందేశాల ప్రకారం, ఆ మ్యూజిక్ కంపెనీ సీఈఓ పేరు బాల్డ్విన్. ఉద్యోగులు జాబ్‌ను సీరియస్‌గా తీసుకోకపోవడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు.

వివరాలు 

సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు

"మీరు ఒప్పందం ప్రకారం మీ బాధ్యతలు నిర్వర్తించడంలో, సమావేశాలకు హాజరుకావడంలో విఫలమయ్యారు. అందుకే మన మధ్య ఒప్పందాన్ని రద్దు చేస్తున్నాను. కంపెనీకి సంబంధించిన వస్తువులు వెంటనే తిరిగి అప్పగించండి. మీ ఖాతాలన్నీ సైన్‌ఔట్ చేయండి. నేను మీకు ఒక మంచి అవకాశం ఇచ్చాను, కానీ మీరు దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు," అంటూ ఆయన పంపిన సందేశంలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సమావేశానికి 111 మంది ఉద్యోగుల్లో కొందరే హాజరయ్యారని, వారిని మాత్రమే కొనసాగించామని, మిగిలిన వారిని తొలగించామని సీఈఓ వివరించారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

వివరాలు 

కంపెనీలో ఇంకేదో జరుగుతోంది..

"మీటింగ్ గురించి సమాచారం సరిగా అందలేదని అనిపిస్తోంది. సమాచారం ఉంటే 99 మంది హాజరుకాకుండా ఉంటారా? ఇది నమ్మశక్యంగా లేదు," అంటూ ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు. "కంపెనీలో ఇంకేదో జరుగుతుందని అనిపిస్తోంది. ఒక్క మీటింగ్‌కు హాజరుకాలేదని 90 శాతం మంది ఉద్యోగులను తొలగించడం సాధారణ విషయం కాదు. ఆర్థిక సమస్యలే కారణమై ఉంటాయనిపిస్తోంది," అని మరొకరు వ్యాఖ్యానించారు. మొత్తానికి ఈ ఘటన వింతగా అనిపిస్తూ, అనేక ప్రశ్నలను రేకెత్తిస్తోంది.