CNG price hike: వాహనదారులకు మరో షాక్.. సీఎన్‌జీ ధరల పెంపు
సీఎన్‌జీ వినియోగదారులకు గ్యాస్ కంపెనీలు మళ్లీ షాకిచ్చాయి. పలు నగరాల్లో సీఎన్‌జీ ధరను కిలోకు రూ.2 మేర పెంచుతున్నట్లు ప్రకటించాయి. ముంబై సహా నొయిడా, ఘాజియాబాద్, గురుగ్రామ్ వంటి నగరాల్లో ఈ పెంపు వర్తించగా, దేశ రాజధాని దిల్లీని మాత్రం ఈ పెంపు ప్రభావం నుంచి మినహాయించారు. దిల్లీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఈ పెంపును ఆ ప్రాంతానికి వర్తింపజేయకపోవడం గమనార్హం. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ దిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో సీఎన్‌జీ ధరను సవరించగా, మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (MGL) ముంబయి వంటి నగరాల్లో కిలోకు రూ.2 మేర పెంచింది. ముంబయిలో ప్రస్తుతం సీఎన్‌జీ ధర కిలోకు రూ.77కి చేరింది.
హైదరాబాద్‌లో దేశంలోనే అత్యధిక సీఎన్‌జీ ధర
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో మాత్రం సీఎన్‌జీ ధర దేశంలో అత్యధికంగా రూ.96కి ఉంది. వ్యాట్ వంటి స్థానిక పన్నుల కారణంగా ఒక్కో రాష్ట్రంలో ధరలు వేర్వేరుగా ఉంటున్నాయి. ఇప్పటికే దిల్లీలో సీఎన్‌జీ ధర రూ.75.09గా ఉంది. అయితే ఎన్నికల అనంతరం ఇక్కడ కూడా ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ధరల పెంపునకు ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్, మహానగర్ గ్యాస్ లిమిటెడ్ వంటి కంపెనీలు ఏ విధమైన స్పష్టమైన కారణాలు తెలియజేయలేదు. పెరుగుతున్న ధరల కారణంగా ఆటో, క్యాబ్ డ్రైవర్లు, సాధారణ వాహనదారులపై ఆర్థిక భారం పడనుంది.