LOADING...
Cooking Oil Price: సామాన్యుడికి మరో షాక్.. వంట నూనె ధరలు భారీగా పెరుగుదల
సామాన్యుడికి మరో షాక్.. వంట నూనె ధరలు భారీగా పెరుగుదల

Cooking Oil Price: సామాన్యుడికి మరో షాక్.. వంట నూనె ధరలు భారీగా పెరుగుదల

వ్రాసిన వారు Jayachandra Akuri
May 02, 2026
06:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం అంతర్జాతీయంగా కొనసాగుతున్న అస్థిర పరిస్థితులు భారతీయుల వంటింటిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ సరఫరా గొలుసును దెబ్బతీశాయి. దీని ఫలితంగా భారత్‌లో వంట నూనెల ధరలు భారీగా పెరిగిపోయాయి. రవాణా ఖర్చులు పెరగడం ఒక కారణమైతే కొందరు వ్యాపారులు ఇదే అవకాశంగా తీసుకుని కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా సామాన్య ప్రజల నెలవారీ బడ్జెట్ దెబ్బతిని, నిత్యావసరాల కొనుగోలు భారంగా మారింది.

వివరాలు

సూమారు 22శాతం వరకు పెంపు

గత నెలలోనే వంట నూనెల ధరలు సుమారు 22 శాతం వరకు పెరిగాయి. ధరల పెరుగుదలను చూస్తే, సన్‌ఫ్లవర్ ఆయిల్ గతంలో రూ.180 ఉండగా ఇప్పుడు రూ.200కి చేరింది. పేదలు ఎక్కువగా ఉపయోగించే పామాయిల్ రూ.120 నుంచి రూ.145కు పెరిగింది. వేరుశనగ నూనె లీటరుపై సుమారు రూ.15 పెరుగుదల కనిపించగా, 15 కిలోల హోల్‌సేల్ టిన్ ధర రూ.2300 నుంచి రూ.2400కు చేరుకుంది. అలాగే సోయాబీన్, రైస్ బ్రాన్, వనస్పతి, ఆవ నూనెలు కూడా లీటరుపై రూ.15 నుంచి రూ.30 వరకు పెరిగాయి. ఈ ప్రభావం కేవలం వంట నూనెలకే పరిమితం కాలేదు.

వివరాలు

భారీగా పెరిగిన ఆహార పదార్థాల ధరలు

వంట గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెరగడంతో సామాన్యుడిపై మరింత భారం పడుతోంది. వాణిజ్య సిలిండర్ ధరల పెరుగుదల కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార పదార్థాల ధరలు కూడా పెరిగాయి. దీంతో వంటింట్లో నూనె భారం, బయట గ్యాస్ భారం కలిసి మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఒత్తిడికి లోనవుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తున్న నిల్వదారులపై కఠిన నిఘా పెట్టడం, అక్రమ నిల్వలను గుర్తించి చర్యలు తీసుకోవడం అవసరమని అంటున్నారు. అంతర్జాతీయ సంక్షోభం పేరుతో ధరలు పెంచకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అవసరమైతే సబ్సిడీలు పెంచడం లేదా దిగుమతి విధానాల్లో మార్పులు చేసి ధరలను స్థిరపరచాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement