LOADING...
TCS Partners with Anthropic: ఆంత్రోపిక్‌తో టీసీఎస్ కీలక ఒప్పందం.. 50 వేల ఉద్యోగులకు క్లాడ్ AI!
ఆంత్రోపిక్‌తో టీసీఎస్ కీలక ఒప్పందం.. 50 వేల ఉద్యోగులకు క్లాడ్ AI!

TCS Partners with Anthropic: ఆంత్రోపిక్‌తో టీసీఎస్ కీలక ఒప్పందం.. 50 వేల ఉద్యోగులకు క్లాడ్ AI!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 11, 2026
01:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కృత్రిమ మేధ (AI) రంగంలో మరో కీలక అడుగు వేసింది. ప్రముఖ AI సంస్థ ఆంత్రోపిక్ (Anthropic)తో ప్రపంచ స్థాయి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థల్లో AI సాంకేతికత వినియోగాన్ని వేగవంతం చేయడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యంగా టీసీఎస్ వెల్లడించింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా, ఆంత్రోపిక్‌కు చెందిన క్లాడ్ పార్ట్‌నర్ నెట్‌వర్క్ (Claude Partner Network)లో టీసీఎస్ గ్లోబల్ ప్రీమియర్ పార్ట్‌నర్‌గా చేరనుంది. అలాగే, క్లాడ్ AI మోడళ్ల ఆధారంగా వివిధ పరిశ్రమలకు ప్రత్యేక AI పరిష్కారాలు అందించేందుకు ప్రత్యేక వ్యాపార విభాగాన్ని ఏర్పాటు చేయనుంది.

వివరాలు 

ఉద్యోగులకు ప్రత్యక్ష అనుభవం కల్పించడం ఈ చర్య వెనుక ఉద్దేశం 

ఇక టీసీఎస్‌లోని సుమారు 50 వేల మంది ఉద్యోగులకు క్లాడ్ AI మోడల్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇంజినీరింగ్, ఫైనాన్స్, లీగల్, మార్కెటింగ్, సేల్స్ వంటి విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు ఈ AI టూల్‌ను వినియోగించనున్నారు. క్లయింట్ ప్రాజెక్టుల్లో అమలు చేయడానికి ముందుగా ఉద్యోగులకు ప్రత్యక్ష అనుభవం కల్పించడం ఈ చర్య వెనుక ఉద్దేశమని సంస్థ తెలిపింది. అంతేకాకుండా, క్లాడ్ కోడ్ ఎకోసిస్టమ్‌లో టీసీఎస్ తన పరిశ్రమల అనుభవాన్ని వినియోగించనుంది. క్లెయిమ్స్ అడ్జుడికేషన్, లెండింగ్ అడ్వైజరీ వంటి రంగాలకు అవసరమైన పునర్వినియోగ నైపుణ్యాలు, ప్లగిన్ల అభివృద్ధిపై రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి.

వివరాలు 

క్లాడ్ AI మోడళ్ల ఆధారంగా సర్టిఫికేషన్ కోర్సులను ప్రారంభించనున్న టీసీఎస్ అయాన్

ఈ భాగస్వామ్యం ద్వారా బ్యాంకింగ్,ఆర్థిక సేవలు,ఆరోగ్య సంరక్షణ,లైఫ్ సైన్సెస్,విమానయాన, టెలికాం వంటి కఠిన నిబంధనలు ఉన్న రంగాలకు ప్రత్యేక AI పరిష్కారాలు అందించనున్నారు. డేటా భద్రత,ఖచ్చితత్వం,నియంత్రణ నిబంధనల కారణంగా ఇప్పటి వరకు AI వినియోగంలో వెనుకబడిన ఈ రంగాల్లో కొత్త అవకాశాలు సృష్టించనున్నట్లు టీసీఎస్ పేర్కొంది. టీసీఎస్ అనుబంధ సంస్థ అయిన యూకేకు చెందిన డిలిజెంటా (Diligenta)కూడా క్లాడ్ AI సాయంతో తన కస్టమర్ సేవలను మరింత మెరుగుపరచాలని నిర్ణయించింది. మరోవైపు, భారత్‌లో ఏటా 7.5 కోట్లకు పైగా పరీక్షలు నిర్వహించే టీసీఎస్ అయాన్ (TCS iON), క్లాడ్ AI మోడళ్ల ఆధారంగా ప్రత్యేక AI శిక్షణ, సర్టిఫికేషన్ కోర్సులను ప్రారంభించనుంది. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు AI నైపుణ్యాలను పెంపొందించుకునే అవకాశం లభించనుంది.

Advertisement

వివరాలు 

ఆంత్రోపిక్‌తో భాగస్వామ్యం తమ AI వ్యూహంలో కీలక మైలురాయి

ఈ సందర్భంగా టీసీఎస్ సీఈఓ కే కృతివాసన్ మాట్లాడుతూ.. ఆంత్రోపిక్‌తో భాగస్వామ్యం తమ AI వ్యూహంలో కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. అత్యాధునిక AI సాంకేతికతను సంస్థల అవసరాలకు అనుగుణంగా మార్చి, భారీ స్థాయిలో వ్యాపార మార్పులకు దోహదపడటమే తమ లక్ష్యమని చెప్పారు. క్లాడ్ AI సామర్థ్యాలను టీసీఎస్ పరిశ్రమల అనుభవంతో కలపడం ద్వారా వినియోగదారులు వేగంగా AI ఆధారిత సేవలను అమలు చేయగలరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement