Loading...
NTA Exam Reforms: ఎన్‌టీఏ పరీక్షల్లో సంస్కరణలు.. నందన్ నీలేకని నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్
ఎన్‌టీఏ పరీక్షల్లో సంస్కరణలు.. నందన్ నీలేకని నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్

NTA Exam Reforms: ఎన్‌టీఏ పరీక్షల్లో సంస్కరణలు.. నందన్ నీలేకని నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 27, 2026
09:22 am

ఈ వార్తాకథనం ఏంటి

జాతీయ పరీక్షా సంస్థ (ఎన్‌టీఏ) నిర్వహించే పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దిశగా ఉన్నతస్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ బృందానికి ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని నేతృత్వం వహించనున్నట్లు ఆదివారం సాయంత్రం విడుదల చేసిన వీడియో సందేశంలో వెల్లడించారు. పరీక్షల నిర్వహణలో అత్యాధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తూ,పారదర్శకతతో కూడిన వ్యవస్థను రూపొందించేందుకు అవసరమైన సూచనలు ఈ టాస్క్‌ఫోర్స్‌ అందిస్తుందని తెలిపారు. ఇందులో ఇస్రో మాజీ ఛైర్మన్‌ ఎస్‌. సోమనాథ్‌తో పాటు వివిధ రంగాలకు చెందిన నిపుణులు సభ్యులుగా ఉంటారని చెప్పారు.

వివరాలు 

సాంకేతికతతో పరీక్షల ప్రక్షాళన

ఆధార్‌ ప్రాజెక్టు అమలు సమయంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఛైర్మన్‌గా నందన్‌ నీలేకని పనిచేసిన విషయం తెలిసిందే.

టాస్క్‌ఫోర్స్‌ సూచనల ఆధారంగా లోపాలకు తావులేని పరీక్షా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాని తెలిపారు.

ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఎన్‌టీఏ పరీక్షల నిర్వహణను మరింత భద్రంగా, పారదర్శకంగా మార్చేందుకు ఈ కమిటీ మార్గదర్శకాలు అందిస్తుందని పేర్కొన్నారు.

అయితే ఈ నిర్ణయంపై కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది.

వివరాలు 

ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నమే: జైరామ్ రమేష్ 

2024 జూన్‌లో నీట్‌-యూజీతో పాటు పలు పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాల అనంతరం డాక్టర్‌ కె. రాధాకృష్ణన్‌ నేతృత్వంలో ఇప్పటికే ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారని, ఆ కమిటీ చేసిన 101 సిఫార్సుల అమలు పూర్తికాకముందే మరో కమిటీని నియమించడం ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నమేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ఆరోపించారు.

రెండేళ్లుగా ఎన్‌టీఏకు పూర్తిస్థాయి డైరెక్టర్‌ జనరల్‌ను కూడా నియమించలేకపోయారని విమర్శించారు.

ADVERTISEMENT

వివరాలు 

నేడు లోక్‌సభలో బిల్లు

పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీని కట్టడి చేసే చట్టాన్ని మరింత కఠినతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టనుంది.

పేపర్‌ లీకేజీ కేసుల విచారణ కోసం ప్రతి రాష్ట్రంలో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయడం,రెండు నెలల్లో విచారణ పూర్తి చేయడం,నేరం రుజువైన వారికి రూ.10కోట్ల వరకు జరిమానా విధించడం వంటి నిబంధనలు ఇందులో ఉండనున్నాయి.

ఈ అంశంపై పార్లమెంట్‌లో ప్రభుత్వం-ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.

నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు అతిగా వ్యవహరించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

అమిత్‌ షాకు రాహుల్‌ గాంధీ లేఖ

శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన చర్యలకు బాధ్యులెవరో తేల్చాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ లేఖ రాశారు.

ఈ చర్యలకు హోంమంత్రి అనుమతి ఇచ్చారా అనే విషయాన్ని కూడా ఆయన ప్రశ్నించారు.

అదే సమయంలో ఈ అంశంపై పార్లమెంట్‌లో అత్యవసర చర్చ జరపాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సాగరికా ఘోష్‌ వాయిదా తీర్మాన నోటీసు ఇవ్వనున్నారు.

సీజేపీ నిరాహార దీక్ష విరమించినా,విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినా ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగించాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.

విద్యార్థులపై పెల్లెట్‌ గన్‌ల వినియోగం, సాధారణ దుస్తుల్లో వచ్చిన పోలీసుల వ్యవహారం, నిరసనకారులకు గాయాలు కావడం వంటి అంశాలను కూడా పార్లమెంట్‌లో ప్రస్తావించేందుకు సిద్ధమవుతున్నాయి.

వివరాలు 

చర్చల ద్వారానే పరిష్కారం: అన్నా హజారే

విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్‌ చేయనున్నాయి.

ప్రజాస్వామ్యంలో సమస్యలకు చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమని సామాజిక కార్యకర్త అన్నా హజారే అభిప్రాయపడ్డారు.

నియంతృత్వ ధోరణితో ఎలాంటి సమస్యను పరిష్కరించలేమని పేర్కొన్నారు.

ప్రభుత్వాలు ప్రజల అభిప్రాయాలను గౌరవించి, ప్రజా సంక్షేమానికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

అవసరమైతే ప్రభుత్వం రెండు అడుగులు వెనక్కి వేసినా ప్రజాప్రయోజనాల కోసం తీసుకునే నిర్ణయాల్లో తప్పేమీ లేదని అన్నారు.

వివరాలు 

ఉద్యమం కొనసాగుతుంది: అభిజీత్‌ దీప్కే

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే ఎక్స్‌లో విడుదల చేసిన వీడియో సందేశంలో, "ఇది ముగింపు కాదు.. ఉద్యమానికి ఆరంభం మాత్రమే. విద్యా వ్యవస్థలో పూర్తి పారదర్శకత వచ్చి, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది" అని స్పష్టం చేశారు.

ఉద్యమానికి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, విమర్శించిన వారికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

వారి విమర్శలే తమను మరింత సమర్థంగా పనిచేసేలా చేశాయని పేర్కొన్నారు.

వివరాలు 

నేడు వాంగ్‌చుక్‌ డిశ్ఛార్జి

సీజేపీ ఉద్యమానికి మద్దతుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రస్తుతం మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హక్కుల ఉద్యమకర్త సోనం వాంగ్‌చుక్‌ను సోమవారం డిశ్చార్జి చేయనున్నారు.

అనంతరం రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించి లద్దాఖ్‌కు బయలుదేరనున్నారు.

విద్యార్థులపై నమోదైన కేసుల ఉపసంహరణకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఇంకా అందాల్సి ఉందని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.

ప్రహ్లాద్‌ జోషీ బాధ్యతల స్వీకారం

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా అనంతరం కేంద్ర విద్యాశాఖ అదనపు బాధ్యతలను ప్రహ్లాద్‌ జోషీ ఆదివారం స్వీకరించారు.

ప్రస్తుతం ఆయన ఆహారం, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాలు, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ADVERTISEMENT