Loading...
'Anti-AI' trade: ఏఐ షేర్ల పతనం.. ఆసియాలో దూసుకెళుతున్న భారత స్టాక్ మార్కెట్
ఏఐ షేర్ల పతనం.. ఆసియాలో దూసుకెళుతున్న భారత స్టాక్ మార్కెట్

'Anti-AI' trade: ఏఐ షేర్ల పతనం.. ఆసియాలో దూసుకెళుతున్న భారత స్టాక్ మార్కెట్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 06, 2026
03:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగానికి సంబంధించిన షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరుగుతున్న వేళ భారత స్టాక్ మార్కెట్ మాత్రం దూసుకెళ్తోంది. ఆసియాలోని ఇతర ప్రధాన మార్కెట్లన్నీ నష్టాల్లో ముగిసినప్పటికీ.. శుక్రవారం భారత స్టాక్ మార్కెట్ మాత్రం లాభాల్లో కొనసాగింది. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల ఆధిపత్యం నేపథ్యంలో ఏఐ రంగంపై నియంత్రణలు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనతో పెట్టుబడిదారులు ఆ రంగానికి చెందిన షేర్ల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. ఈ పరిణామం భారత మార్కెట్‌కు కలిసొచ్చింది. దీంతో ఐదేళ్లకు పైగా కాలంలో ఎన్నడూ లేనంతగా ఈ వారం భారత మార్కెట్‌ దూసుకెళ్తోంది.

వివరాలు 

ఏఐ షేర్ల పతనం.. భారత్‌కు కలిసొచ్చిన పరిణామాలు

సుమారు 5.3 ట్రిలియన్ డాలర్ల విలువైన భారత మార్కెట్‌లో కేవలం రెండు వారాల్లోనే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

ఏఐ రంగంలో భారత మార్కెట్‌కు పెద్దగా పెట్టుబడులు లేకపోవడం గతంలో ప్రతికూలంగా మారింది.

ప్రపంచ పెట్టుబడిదారులు భారత షేర్ల నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడంతో ఆసియాలోనే అత్యంత పేలవ ప్రదర్శన చేసిన మార్కెట్లలో భారత్ ఒకటిగా నిలిచింది.

అయితే ఇప్పుడు ఏఐ షేర్లలో అమ్మకాలు పెరుగుతుండటంతో అదే పరిస్థితి భారత మార్కెట్‌కు అనుకూలంగా మారింది.

విదేశీ పెట్టుబడిదారులు మళ్లీ భారత మార్కెట్‌లోకి వస్తుండటంతో ఈ ఏడాది ఇప్పటివరకు నమోదైన నష్టాలు తగ్గుతున్నాయి.

మరోవైపు ముడి చమురు ధరలు భారీగా పడిపోవడం, కంపెనీల ఆదాయాలపై అంచనాలు మెరుగుపడటం కూడా మార్కెట్‌కు ఊతమిస్తున్నాయి.

వివరాలు 

విదేశీ పెట్టుబడుల వెల్లువ.. భారత మార్కెట్‌పై పెరుగుతున్న విశ్వాసం

స్వల్పకాలంలో ఇతర ఆసియా మార్కెట్లతో పోలిస్తే భారత మార్కెట్ మెరుగైన ప్రదర్శన చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని లోగోస్ అసెట్ మేనేజ్‌మెంట్ వ్యవస్థాపకుడు,చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ చార్లీ హాంగ్ అభిప్రాయపడ్డారు.

అయితే మధ్యకాలంలోనూ ఇదే జోరు కొనసాగాలంటే కంపెనీల ఆదాయాలు క్రమంగా పుంజుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

విదేశీ పెట్టుబడిదారులు ఈ వారంలో బుధవారం వరకు భారత షేర్లలో నికరంగా 1.9 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టారు.

గురువారం ప్రాథమిక గణాంకాల ప్రకారం మరో 1.6 బిలియన్ డాలర్ల నిధులు వచ్చాయి.

అంతేకాకుండా భారత మార్కెట్ పడిపోతుందనే అంచనాతో గతంలో తీసుకున్న షార్ట్ పొజిషన్లను కూడా విదేశీ ఇన్వెస్టర్లు తగ్గించుకుంటున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

బలపడిన రూపాయి విలువ

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో ఇండెక్స్ ఫ్యూచర్స్‌కు సంబంధించిన షార్ట్ పొజిషన్లు ఈ వారంలో లక్షకు పైగా కాంట్రాక్టులు తగ్గాయి.

విదేశీ పెట్టుబడులు ఒక్కసారిగా పెరగడంతో ఈ వారం ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రదర్శన చేసిన మార్కెట్లలో భారత ఈక్విటీలు చోటు దక్కించుకున్నాయి.

దీనికి తోడు రూపాయి విలువ కూడా బలపడింది. గత నెలలో డాలర్‌తో పోలిస్తే రికార్డు కనిష్ఠ స్థాయికి చేరువైన రూపాయి.. తాజాగా 0.4 శాతం వరకు పెరిగి ఒక డాలర్‌కు రూ.94.0675 స్థాయికి చేరింది.

ఏప్రిల్ తర్వాత ఇదే అత్యధిక విలువ. అంతేకాకుండా 2025 తర్వాత తొలిసారిగా డాలర్‌తో రూపాయి మారకం రేటు 200 రోజుల సగటు స్థాయి కంటే దిగువకు వచ్చింది.

ADVERTISEMENT

వివరాలు 

11 ఏళ్ల తర్వాత వార్షిక నష్టాల భయం 

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు మళ్లీ తీవ్రరూపం దాల్చకపోతే రూపాయి బలపడే పరిస్థితులు కొనసాగవచ్చని కోటక్ నియో పరిశోధన విభాగం అధిపతి అనింద్య బెనర్జీ తెలిపారు.

డాలర్‌తో పోలిస్తే రూపాయి 94 స్థాయిని అధిగమించి మరింత బలపడితే.. ఏప్రిల్ నుంచి కొనసాగుతున్న మారకం రేటు పరిధి నుంచి బయటపడే అవకాశం ఉందన్నారు.

అప్పుడు ఎగుమతిదారులు పెద్ద ఎత్తున డాలర్లను విక్రయించే పరిస్థితి ఏర్పడవచ్చని పేర్కొన్నారు.

అయితే భారత మార్కెట్‌కు ఇంకా కొన్ని సవాళ్లు ఉన్నాయి.ఈ ఏడాది 11ఏళ్ల తర్వాత తొలిసారిగా భారత షేర్లు వార్షిక నష్టాలను నమోదు చేసే పరిస్థితి కనిపిస్తోంది.

ఆసియాలో బలహీనమైన కరెన్సీల్లో రూపాయి కూడా ఒకటిగా ఉంది.

ఈ ఏడాది విదేశీ పెట్టుబడుల ఉపసంహరణలు ఇప్పటికీ రికార్డు స్థాయిలోనే కొనసాగుతున్నాయి.

వివరాలు 

చమురు ధరల తగ్గుదలతో మార్కెట్‌కు ఊతం..

ఇంధన వ్యయాలు అధికంగా ఉండటంతో పాటు ఉత్తర ఆసియా దేశాలతో పోలిస్తే భారత కంపెనీల ఆదాయాల వృద్ధి కూడా వెనుకబడి ఉంది.

అయినప్పటికీ ముడి చమురు ధరలు తగ్గడం, కంపెనీల ఆదాయాలు మెరుగుపడటం భారత మార్కెట్‌కు మరింత ప్రయోజనం చేకూర్చవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ఫలితాలు ప్రకటించిన బీఎస్ఈ 100లోని సుమారు మూడింట రెండొంతుల కంపెనీల లాభాల వృద్ధి గత ఐదు త్రైమాసికాల్లో ఎన్నడూ లేనంత వేగంగా నమోదైందని, ఇది మార్కెట్ అంచనాలను కూడా అధిగమించిందని సిటీ గ్రూప్ వెల్లడించింది.

ఏఐ రంగంలో పెట్టుబడుల పరిస్థితి ఎలా ఉన్నా.. ముడి చమురు ధరలు తగ్గితే భారత ఆర్థిక పరిస్థితులు మరింత మెరుగుపడతాయని కోటక్ సెక్యూరిటీస్ విశ్లేషకులు తమ నివేదికలో పేర్కొన్నారు.

ADVERTISEMENT