LOADING...
Xiaomi: షావోమీకి ఆపిల్‌, శాంసంగ్‌ లీగల్‌ నోటీసులు
షావోమీకి ఆపిల్‌, శాంసంగ్‌ లీగల్‌ నోటీసులు

Xiaomi: షావోమీకి ఆపిల్‌, శాంసంగ్‌ లీగల్‌ నోటీసులు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 28, 2025
02:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ వ్యాప్తంగా పేరుపొందిన టెక్నాలజీ దిగ్గజాలు ఆపిల్‌, శాంసంగ్‌లు చైనా ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ షావోమీకి లీగల్‌ నోటీసులు జారీ చేశాయి. షావోమీ తమ వ్యాపార ప్రకటనల్లో ఆపిల్‌, శాంసంగ్‌ ఉత్పత్తులతో పోలికలు చూపించడం ఈ నోటీసుల కారణమని తెలుస్తోంది. ఆ ప్రకటనలు తమ ప్రీమియం బ్రాండ్‌ ప్రతిష్టకు భంగం కలిగించే ఉద్దేశ్యంతో చేశారని ఇరు కంపెనీలు ఆరోపిస్తున్నాయి. సాధారణంగా వ్యాపార ప్రకటనల్లో ఒక బ్రాండ్‌ను మరో బ్రాండ్‌తో పోల్చడం కొత్తేమీ కాదు. అయితే షావోమీ మాత్రం పోటీ పరిమితులను దాటుతూ, తమ ఉత్పత్తులను ప్రతికూలంగా చూపించే విధంగా ప్రచారం చేసిందని యాపిల్‌, శాంసంగ్‌లు వాదిస్తున్నాయి.

వివరాలు 

వివాదానికి కారణం 

ముఖ్యంగా భారత్‌ లాంటి ప్రధాన మార్కెట్‌లో ఈ తరహా ప్రకటనలు తమ ఇమేజ్‌కు తీవ్ర నష్టం కలిగించే ప్రమాదం ఉందని రెండు కంపెనీలు నోటీసుల్లో పేర్కొన్నాయి. వెంటనే ఆ ప్రకటనలను నిలిపివేయాలని, ఇకపై మళ్లీ ఇలాంటి చర్యలు తీసుకుంటే చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టంగా హెచ్చరించాయి. ఈ వివాదానికి మూలం షావోమీ ఈ సంవత్సరం ఏప్రిల్‌లో దేశంలోని ప్రధాన పత్రికల్లో ఇచ్చిన ఫుల్‌పేజీ ప్రకటనలే. వాటిలో ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌ కెమెరాను కించపరుస్తూ,తమ కొత్త షావోమీ 15 అల్ట్రా కెమెరా దానికంటే మెరుగైన ఫలితాలు ఇస్తుందని పేర్కొంది.

వివరాలు 

శాంసంగ్‌పై కూడా షావోమీ ఇదే తరహా ప్రకటనలు

అంతేకాకుండా, ''ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌ కెమెరా షావోమీ 15 అల్ట్రాను ఓడిస్తుందని నమ్మేవారికి హ్యాపీ ఏప్రిల్‌ ఫూల్స్‌ డే'' అంటూ వ్యంగ్యంగా రాసింది. మార్చిలో 15 సిరీస్‌ విడుదల సమయంలో కూడా ఇలాంటి ప్రచారమే చేసింది. ఐఫోన్‌ కెమెరాను సరదాగా 'క్యూట్‌' అంటూ చిన్నచూపు చూసి, ''ఇప్పుడు నిజమైన లెన్స్‌ ద్వారా చూడాల్సిన సమయం వచ్చింది'' అని వ్యాఖ్యానించింది. శాంసంగ్‌పై కూడా షావోమీ ఇదే తరహా దూకుడుతో ప్రకటనలు చేసింది. తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్లు అందించడంలో పేరుగాంచిన షావోమీ.. ఇప్పుడు భారతదేశంలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ విభాగంలో బలమైన స్థానాన్ని సంపాదించడానికి కృషి చేస్తోంది. ఈ విభాగంలో ప్రస్తుతం యాపిల్‌, శాంసంగ్‌లు ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి.