Apple AirPods: భారత్ నుంచి 10 లక్షలకు పైగా ఎయిర్‌పాడ్స్ ఎగుమతి చేసిన ఆపిల్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో తయారీ సామర్థ్యం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆపిల్ సంస్థ ఆగస్టు 2025 నుంచి జనవరి 2026 మధ్య కాలంలో భారత్ నుంచి 10 లక్షలకు పైగా ఎయిర్‌పాడ్స్‌ను ఎగుమతి చేసింది. హైదరాబాద్‌లోని ఫాక్స్‌కాన్ యూనిట్ నుంచి అమెరికా, లాటిన్ అమెరికా, యూరప్ మార్కెట్లకు ఈ ఉత్పతులు పంపించారు. గతేడాది ఏప్రిల్‌లో ట్రయల్ ప్రొడక్షన్ ప్రారంభించిన ఫాక్స్‌కాన్ అనుబంధ సంస్థ ఫాక్స్‌కాన్ ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ, ఆగస్టు నుంచి వాణిజ్య ఉత్పత్తిని మొదలుపెట్టి నెలకు సుమారు రెండు లక్షల యూనిట్ల స్థాయికి ఉత్పత్తిని పెంచింది. హైదరాబాద్ ప్లాంట్‌లో ఇప్పటివరకు దాదాపు రూ.3,000 కోట్ల పెట్టుబడి పెట్టగా, విస్తరణతో మొత్తం పెట్టుబడి రూ.4,800 కోట్లకు చేరనుంది.
వివరాలు
మేక్ ఇన్ ఇండియాతో ఆపిల్‌కు లాభం… ఎగుమతుల్లో కొత్త రికార్డు
ఉద్యోగుల సంఖ్య కూడా 2,200 నుంచి 5,000 వరకు పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, పుణేలో ఎయిర్‌పాడ్స్‌కు అవసరమైన ప్లాస్టిక్ కవర్లు తయారు చేస్తున్న జాబిల్ సంస్థ కూడా భారత్‌లో కార్యకలాపాలను విస్తరిస్తోంది. స్థానిక ప్రోత్సాహకాలు, పటిష్టమవుతున్న సరఫరా వ్యవస్థను సద్వినియోగం చేసుకుంటూ 'మేక్ ఇన్ ఇండియా' లక్ష్యాల వైపు ఆపిల్ ముందడుగు వేస్తోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దేశీయంగా డిమాండ్ ఎక్కువగా దిగుమతులపై ఆధారపడుతున్నప్పటికీ, భారత్‌లో ఎయిర్‌పాడ్స్ తయారీ పెరగడం వల్ల ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు దేశీయ, అంతర్జాతీయ ప్రీమియం మార్కెట్లను మరింతగా అందుకునే అవకాశం ఏర్పడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.