LOADING...
Apple: ఎన్‌విడియా,మైక్రోసాఫ్ట్ తర్వాత 4 ట్రిలియన్ క్లబ్'లోకి ఆపిల్ 
ఎన్‌విడియా,మైక్రోసాఫ్ట్ తర్వాత 4 ట్రిలియన్ క్లబ్'లోకి ఆపిల్

Apple: ఎన్‌విడియా,మైక్రోసాఫ్ట్ తర్వాత 4 ట్రిలియన్ క్లబ్'లోకి ఆపిల్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 28, 2025
07:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా టెక్ దిగ్గజం ఆపిల్ మంగళవారం మరో చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. సంస్థ మార్కెట్ విలువ మొదటిసారి $4 ట్రిలియన్ (సుమారు ₹334 లక్షల కోట్ల రూపాయలు) దాటింది. నూతన ఐఫోన్ మోడళ్లకు బలమైన డిమాండ్ రావడంతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ఆపిల్ వెనుకబాటుపై ఉన్న ఆందోళనలు తగ్గాయి. ట్రేడింగ్ ప్రారంభ దశలో ఆపిల్ షేర్లు 0.2% పెరిగి $269.2 వద్ద ఆల్‌టైమ్ హైను తాకాయి. గత సెప్టెంబర్ 9న కొత్త ఐఫోన్‌లను ఆవిష్కరించిన తర్వాత ఆపిల్ షేర్లు సుమారు 13% మేర పెరిగి, ఈ ఏడాది మొదటిసారిగా పాజిటివ్ జోన్‌లోకి ప్రవేశించాయి.

వివరాలు 

మెరికా విధించిన అధిక టారిఫ్‌ల కారణంగా కొంత వెనుకబాటు 

"ఆపిల్ లాభాల్లో సగానికి పైగా ఐఫోన్ వాటానే ఉంటుంది. ఎక్కువ మంది చేతుల్లో ఐఫోన్ చేరితే, వారు ఆపిల్ ఎకోసిస్టంలో ఎక్కువగా మమేకం అవుతారు," అని నార్త్‌లైట్ అసెట్ మేనేజ్‌మెంట్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ క్రిస్ జాకారెల్లీ వ్యాఖ్యానించారు. ఇదివరకు ఆపిల్ షేర్లు చైనాలో పెరుగుతున్న పోటీ, అలాగే అమెరికా విధించిన అధిక టారిఫ్‌ల కారణంగా కొంత వెనకబడ్డాయి. అయితే తాజాగా విడుదల చేసిన ఐఫోన్ 17 సిరీస్, ఐఫోన్ ఎయిర్ మోడళ్లతో చైనా నుంచి రష్యా వరకు వినియోగదారుల ఆదరణ తిరిగి పెరిగింది. అధిక టారిఫ్‌ల భారం సంస్థ స్వయంగా భరించింది. ఐఫోన్ ఎయిర్ సన్నగా ఉండే డిజైన్ సామ్‌సంగ్ వంటి ప్రత్యర్థులకు సవాల్ విసరగలదని విశ్లేషకులు భావిస్తున్నారు.

వివరాలు 

 అగ్రస్థానంలో $4.5 ట్రిలియన్ మార్కెట్ విలువతో  ఎన్‌విడియా 

రీసెర్చ్ సంస్థ కౌంటర్‌పాయింట్‌ డేటా ప్రకారం, ఐఫోన్ 17 విక్రయాలు అమెరికా, చైనాల్లో 14% పెరుగుదల చూపించాయి. బ్రోకరేజ్ సంస్థ ఎవర్‌కోర్ ISI అంచనా ప్రకారం, సెప్టెంబర్ త్రైమాసికంలో ఆపిల్ అంచనాలకు మించి ఫలితాలు సాధించి, డిసెంబర్ త్రైమాసికానికి ఉత్సాహవంతమైన అంచనాలు ఇవ్వవచ్చని చెబుతోంది. ఆపిల్, నివిడియా,మైక్రోసాఫ్ట్ తర్వాత $4 ట్రిలియన్ క్లబ్‌లో చేరిన మూడో సంస్థ. ప్రస్తుతం ఎన్‌విడియా $4.5 ట్రిలియన్ మార్కెట్ విలువతో అగ్రస్థానంలో ఉంది. తాజాగా మైక్రోసాఫ్ట్ షేర్లు 2.2% పెరగడంతో ఆ సంస్థ కూడా మళ్లీ ఈ క్లబ్‌లోకి వచ్చింది. OpenAIతో ChatGPT ప్రాజెక్టుకు సంబంధించి కొత్త ఒప్పందం కుదుర్చుకోవడం ఇందుకు దోహదం చేసింది.

వివరాలు 

సిరీ వాయిస్ అసిస్టెంట్‌లో AI అప్‌గ్రేడ్ వచ్చే ఏడాది వరకూ వాయిదా 

AI రంగంలో యాపిల్ మెల్లగా అడుగులు వేస్తుండటంపై కొంత ఆందోళన నెలకొంది. కొంతమంది సీనియర్ AI నిపుణులు మెటా కంపెనీకి మారుతున్నారని నివేదికలు సూచిస్తున్నాయి. యాపిల్ ఇంటెలిజెన్స్ సూట్, ChatGPT ఇంటిగ్రేషన్ వంటి ప్రాజెక్టులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. సిరీ వాయిస్ అసిస్టెంట్‌లో AI అప్‌గ్రేడ్ వచ్చే ఏడాది వరకూ వాయిదా పడింది. కంపెనీ అల్ఫాబెట్ జెమిని AI, ఆంత్రోపిక్, ఓపెన్‌ఏఐ సంస్థలతో భాగస్వామ్యాలపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. "యాపిల్‌కు స్పష్టమైన AI వ్యూహం లేకపోవడం షేర్ మార్కెట్‌పై ఒత్తిడిని సృష్టిస్తోంది. వినియోగదారులను ఆకట్టుకునే రీతిలో AIని చేర్చగలిగితే, యాపిల్ పూర్తిగా కొత్త దిశలో దూసుకుపోతుంది," అని జాకారెల్లీ అన్నారు.

వివరాలు 

33.2 రెట్లు విలువతో ట్రేడవుతున్నఆపిల్

గత ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో యాపిల్ అత్యుత్తమ ఫలితాలను నమోదు చేసింది. ముఖ్య విభాగాల్లో డబుల్ డిజిట్ వృద్ధిని సాధించింది. అక్టోబర్ 30న కంపెనీ తన నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించనుంది. ప్రస్తుతం యాపిల్ షేర్లు తదుపరి 12 నెలల లాభ అంచనాలపై 33.2 రెట్లు విలువతో ట్రేడవుతున్నాయి. ఇది నాస్‌డాక్ 100 సూచీ (27.42) కంటే ఎక్కువ. ఈ సంవత్సరం ఇప్పటివరకు యాపిల్ షేర్లు 7% పెరిగి, టెక్ ఆధారిత నాస్‌డాక్ సూచీ 22% లాభంతో పోలిస్తే వెనుకబడ్డాయి.