Page Loader
ArcelorMittal: ఉక్కు రంగంలో దిగ్గజ సంస్థ ఆర్సెలార్‌ మిత్తల్‌.. రూ.1,61,198 కోట్లు!
ఉక్కు రంగంలో దిగ్గజ సంస్థ ఆర్సెలార్‌ మిత్తల్‌.. రూ.1,61,198 కోట్లు!

ArcelorMittal: ఉక్కు రంగంలో దిగ్గజ సంస్థ ఆర్సెలార్‌ మిత్తల్‌.. రూ.1,61,198 కోట్లు!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2024
08:15 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉక్కు పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న ఆర్సెలార్ మిత్తల్, జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్‌తో కలిసి స్థాపించనున్న ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ (ఐఎస్‌పీ) ప్రతిపాదనకు బుధవారం జరిగే మంత్రిమండలి సమావేశంలో ఆమోదం లభించే అవకాశం ఉంది. ఈ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో పెట్టుబడి మొత్తం రూ.1,61,198 కోట్లుగా ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 63 వేల మందికి ఉపాధి కల్పించబడుతుందని ప్రణాళికలు వెల్లడించాయి.

వివరాలు 

మొదటి దశ: రూ.70 వేల కోట్ల పెట్టుబడి 

ప్రాజెక్ట్ మొదటి దశలో నాలుగేళ్ల వ్యవధిలో రూ.70 వేల కోట్లతో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించనున్నారు. ఏటా 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ దశలో సుమారు 20,000 మందికి ఉపాధి కల్పించబడుతుంది. ఈ దశ పనులు 2029 జనవరికి పూర్తి చేయాలని నిర్ణయించారు. భూమి కేటాయింపు సంస్థ అందించిన ప్రీ-ఫీజిబులిటీ రిపోర్టు ఆధారంగా నక్కపల్లి మండలంలో ఏపీఐఐసీకి చెందిన 2,164.31 ఎకరాల భూమి ప్రభుత్వం గుర్తించింది. బుచ్చయ్యపేట, చందనాడ, డీఎల్‌పురం, రాజయ్యపేట, వేంపాడ వంటి ప్రాంతాల్లో ఈ భూములు కేటాయించారు.

వివరాలు 

రెండో దశ: రూ.80 వేల కోట్ల పెట్టుబడి 

రెండో దశలో రూ.80 వేల కోట్లతో ఉక్కు కర్మాగారం పనులను కొనసాగిస్తారు. ఈ దశలో ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం 24 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకుంటుంది. ఈ పనులు 2033 నాటికి పూర్తి చేసి, అదనంగా 35 వేల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఉత్పత్తి సామర్థ్యం లక్ష్యాలు దేశీయ ఉక్కు ఉత్పత్తిలో 20 శాతం వాటాను సాధించాలని ప్రణాళిక చేశారు. 2035 నాటికి 40 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించడమే లక్ష్యం. ప్రస్తుతం 9.6 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఎస్సార్ స్టీల్ ప్లాంట్‌ను కొనుగోలు చేయగా, కొత్త పరిశ్రమతో 15 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని భావిస్తున్నారు.

వివరాలు 

కో-టెర్మినస్ పోర్ట్ అభివృద్ధి 

నక్కపల్లి వద్ద కో-టెర్మినస్ పోర్ట్ ఆధారిత క్లస్టర్ ఏర్పాటుకు అనువుగా ఉన్న భూములను పరిశీలించినట్లు తెలిపారు. మిత్తల్‌ సంస్థ తన ఉక్కు కర్మాగారానికి అనుసంధానంగా కో-టెర్మినస్‌ క్యాప్టివ్‌ పోర్టును రెండు దశల్లో అభివృద్ధి చేసేందుకు రూ.11,198 కోట్లు వెచ్చించనున్నది. మొదటి దశలో పోర్టు నిర్మాణానికి రూ.5,816 కోట్లను వెచ్చించనుండగా, ఈ ప్రాజెక్ట్ ద్వారా 3,000 మందికి ఉపాధి లభిస్తుంది. మొదటి దశలో మొత్తం 5 బెర్తులను అభివృద్ధి చేయనున్నారు, వీటి పొడవు 1.5 కి.మీ.గా ఉంటుంది. దీని ద్వారా ప్రతి సంవత్సరం 20.5 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ఎగుమతులు, దిగుమతులు నిర్వహించనున్నారు. ఈ దశ కోసం 150 ఎకరాల భూమిని కేటాయించాలని సంస్థ ప్రభుత్వం వద్ద ప్రతిపాదించింది.

వివరాలు 

రెండో దశలో పోర్టు విస్తరణకు రూ.5,382 కోట్లు

రెండో దశలో పోర్టు విస్తరణకు రూ.5,382 కోట్లు వెచ్చించాలని సంస్థ పేర్కొంది. ఈ దశలో అదనంగా 12 బెర్తులను నిర్మించేందుకు 170 ఎకరాల భూమి అవసరమని సంస్థ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ప్రతి సంవత్సరం అదనంగా 28.99 మిలియన్‌ టన్నుల రవాణా సామర్థ్యం పెరుగుతుందని, ఈ విస్తరణ దశలో మరో 5,000 మందికి ఉపాధి లభిస్తుందని సంస్థ ప్రకటించింది.