Artificial Intelligence: ఏఐ భారత్‌కు ప్రమాదం కాదు.. అసలు సవాల్ ఇదే : ఐబీఎం ఇండియా చీఫ్
ఈ వార్తాకథనం ఏంటి
ఐబీఎం ఇండియా చీఫ్ సందీప్ పాటిల్ భారతదేశంలో కృత్రిమ మేధ (AI), మానవ వనరుల వినియోగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఏఐ రంగంలో ప్రపంచ అగ్రగామిగా ఎదగాలంటే ప్రభుత్వం, ప్రైవేట్ కంపెనీలు, విద్యాసంస్థలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ముఖ్యంగా నైపుణ్యాభివృద్ధి, సరైన విధానాల రూపకల్పనపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. అలాగే ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు రీ-స్కిల్లింగ్, అప్-స్కిల్లింగ్ శిక్షణ ఇవ్వడంపై మరింత దృష్టి సారించాలని సూచించారు. అన్ని రంగాల్లోకి ఏఐ వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, ఈ టెక్నాలజీ భారత్‌కు ప్రధాన సవాల్ కాదని, లక్షలాది మంది ఉద్యోగులను భవిష్యత్తుకు సిద్ధం చేయడమే అసలైన సవాల్ అని ఆయన స్పష్టం చేశారు.
వివరాలు
నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి
మీడియాతో మాట్లాడిన సందీప్ పటేల్, "ఏఐ రేసులో భారత్‌కు ఉన్న అతిపెద్ద బలం యువత. దేశ జనాభాలో సగానికి పైగా 30 ఏళ్లలోపు వారే ఉండటం ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ వర్క్‌ఫోర్స్‌ను నిర్మించడానికి గొప్ప అవకాశంగా మారొచ్చని అన్నారు. అయితే ఏఐ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న వేగానికి అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోకపోతే, భారత మానవ వనరుల ప్రత్యేకత ప్రయోజనం లేకుండా పోతుందని ఆయన హెచ్చరించారు. ఇదిలా ఉండగా, కృత్రిమ మేధ ప్రభావంతో ఐటీ రంగంలో ఉద్యోగాల స్వరూపం వేగంగా మారుతోంది.
వివరాలు
ఏఐ వల్ల పూర్తిగా ఉద్యోగాలు పోవు
జనరేటివ్ ఏఐ టూల్స్ ఇప్పటికే కోడ్ రాయడం, డేటా విశ్లేషణ చేయడం, ఎంట్రీ లెవెల్ ఉద్యోగులు నిర్వహించే అనేక పనులను వేగంగా పూర్తి చేస్తున్నాయి. ఏఐ వల్ల పూర్తిగా ఉద్యోగాలు మాయం కావని, కానీ పని చేసే విధానం మాత్రం గణనీయంగా మారిపోతుందని సందీప్ పటేల్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో కంపెనీలు నియామకాల సమయంలో కూడా కొత్త తరహా నైపుణ్యాలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఐ ప్రభావంపై చర్చ జరుగుతున్న వేళ, ఉద్యోగాల భవిష్యత్తు, నైపుణ్యాభివృద్ధిపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.