Tata Trusts: టాటా ట్రస్ట్స్‌లో,మెహ్లీ మిస్త్రీ తొలగింపుకు మెజారిటీ ఓటు
ఈ వార్తాకథనం ఏంటి
దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అత్యంత విశ్వసనీయుడిగా పేరుపొందిన మెహ్లీ మిస్త్రీకి టాటా ట్రస్టులలో ఈసారి అవకాశం దక్కలేదు. టాటా గ్రూప్‌కు చెందిన మూడు ప్రధాన దాతృత్వ సంస్థల్లో ఆయన్ను జీవితకాల ట్రస్టీగా తిరిగి నియమించాలన్న ప్రతిపాదనకు ఆమోదం లభించలేదని తెలుస్తోంది. దీంతో టాటా ట్రస్టులతో మెహ్లీ మిస్త్రీ అనుబంధం ముగిసినట్లుగా భావిస్తున్నారు. ఈ విషయాన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా ఎకనామిక్ టైమ్స్ వెల్లడించింది. సర్ రతన్ టాటా ట్రస్ట్ (SRTT),సర్ దోరాబ్జీ టాటా ట్రస్ట్ (SDTT), బాయి హీరాబాయి జంషెడ్జీ టాటా నవ్సారి చారిటబుల్ ఇన్‌స్టిట్యూషన్‌కి మెహ్లీ మిస్త్రీని మళ్లీ ట్రస్టీగా నియమించేందుకు టాటా ట్రస్ట్స్ సీఈఓ గత వారం ఇతర ట్రస్టీలకు సర్క్యులర్ పంపించారు.
వివరాలు
జీవితకాల ట్రస్టీగా వేణు శ్రీనివాసన్
అయితే ఈ ప్రతిపాదనకు ట్రస్టీలు నోయల్ టాటా, వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్‌లు వ్యతిరేకించినట్లు సమాచారం. గురువారం అర్ధరాత్రి తర్వాత తమ నిర్ణయాన్ని సీఈఓకు ఈ ముగ్గురు తెలియజేశారని తెలుస్తోంది. దీంతో ట్రస్టులలో మెజారిటీ మద్దతు రాకపోవడంతో మెహ్లీ మిస్త్రీ పునర్నియామకం ఆమోదం పొందలేదు. ఇటీవలి కాలంలో టాటా గ్రూప్‌లో అంతర్గత విభేదాలు ఉధృతమవుతున్నాయనే వార్తల నడుమ ఈ పరిణామం చర్చనీయాంశమైంది. 2022లో మెహ్లీ మిస్త్రీ టాటా ట్రస్టుల ట్రస్టీగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన మూడేళ్ల పదవీకాలం అక్టోబర్ 28తో ముగుస్తుంది. ఇదే సమయంలో వేణు శ్రీనివాసన్‌ను జీవితకాల ట్రస్టీగా మళ్లీ నియమించడాన్ని ట్రస్టీలు ఏకగ్రీవంగా ఆమోదించిన విషయం తెలిసిందే.
వివరాలు
తెరపైకి టాటా గ్రూప్‌లో అంతర్గత వివాదాలు
వేణు శ్రీనివాసన్ పునర్నియామకానికి అనుమతి ఇస్తూ, భవిష్యత్‌లో ట్రస్టీల పునర్నియామకాలు కూడా ఏకగ్రీవ ఆమోదంతోనే జరగాలన్న నిబంధనను మిస్త్రీతో పాటు మరో ముగ్గురు ట్రస్టీలు ప్రతిపాదించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయినప్పటికీ, ఈసారి మిస్త్రీకి ఆమోదం లభించకపోవడం గమనార్హం. ఇటీవల టాటా గ్రూప్‌లో అంతర్గత వివాదాలు తెరపైకి వస్తున్నాయి. గత సెప్టెంబర్‌లో విజయ్ సింగ్‌ను నామినీ డైరెక్టర్‌గా తిరిగి నియమించడాన్ని నలుగురు ట్రస్టీలు వ్యతిరేకించగా, సంస్థలో ఆధిపత్య పోరు మొదలైందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ పరిణామాల మధ్య కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని సమస్యను సంస్థ అంతర్గతంగా పరిష్కరించుకోవాలని సూచించినట్లు వార్తలు వెలువడ్డాయి.