US-Iran war: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం: విమాన పరిశ్రమకు రూ.18,000 కోట్ల నష్టం
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి భారత్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇప్పటివరకు సుమారు 15-20శాతం మేర తగ్గుదల నమోదైంది. ఇదే సమయంలో విమానయాన రంగం తీవ్రంగా దెబ్బతిని, మొత్తం నష్టం రూ.18,000 కోట్లకు చేరిందని ఒక నివేదిక వెల్లడించింది. 'భారత పర్యాటకం, విమానయానం,ఆతిథ్య రంగాలపై పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం'పేరుతో ఈ నివేదిక విడుదలైంది. ఈ నివేదిక ప్రకారం విమానయాన రంగమే అత్యధికంగా ప్రభావితమైంది. గగనతల పరిమితులు, విమాన రద్దులు, అంతర్జాతీయ మార్గాల మళ్లింపులు వంటి సమస్యలు తీవ్రంగా ఎదురవుతున్నాయి. దీనివల్ల ముఖ్యమైన మార్గాల్లో ప్రయాణ సమయం 2 నుంచి 4 గంటల వరకు పెరిగింది. దీని కారణంగా ఇంధన వినియోగం పెరగడంతో పాటు నిర్వహణ ఖర్చులు కూడా భారీగా పెరిగాయి.
వివరాలు
పర్యాటకుల రద్దీ 15-20% మేర క్షీణత
విమానయాన రంగంలో మొత్తం ఖర్చుల్లో ఇంధనానికి 35-40శాతం వాటా ఉండటం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోంది. ప్రస్తుత పరిస్థితులు కొనసాగితే సంస్థల లాభాలు మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా. మొత్తం మీద విమానయాన రంగానికి రూ.18,000 కోట్ల నష్టం సంభవించే అవకాశముందని రేటింగ్ సంస్థ అంచనాలను పీహెచ్‌డీసీసీఐ వెల్లడించింది. పర్యాటక రంగంలో విరామ ప్రయాణాలు 15-20శాతం మేర తగ్గాయి.యుద్ధ పరిస్థితుల కారణంగా విదేశీ ప్రయాణికులు జాగ్రత్తలు పాటించడం ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఆహార సేవల రంగంపై కూడా మిశ్రమ ప్రభావం పడుతోంది. దిగుమతి ముడి సరుకుల ధరలు పెరగడంతో పాటు రవాణా ఖర్చులు,ఇంధన ధరలు పెరగడం వల్ల వ్యాపారాలపై అదనపు భారం పడుతోందని భారత ఆహార సేవల సంఘం తెలిపింది.
వివరాలు
రోజుకు రూ.2,650 కోట్ల నష్టం
భారత ఆహార సేవల మార్కెట్ విలువ 2024 నాటికి రూ.5.69 లక్షల కోట్లుగా ఉండగా, 2028 నాటికి అది రూ.7.76 లక్షల కోట్లకు చేరే అవకాశముందని అంచనా. 2026లో ఈ రంగం విలువ రూ.6.46 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉంది. అంటే రోజుకు సుమారు రూ.17,700 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే 15-20 శాతం తగ్గుదల కారణంగా రోజుకు సుమారు రూ.2,650 కోట్ల మేర నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా.
వివరాలు
ఐరోపాలో విమాన రాకపోకలు ఆగే ప్రమాదం
ఇరాన్ యుద్ధం కొనసాగుతూ ముడి చమురు సరఫరాకు ఆటంకాలు కలిగితే, ఐరోపాలో విమాన రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడవచ్చని అంతర్జాతీయ ఇంధన సంస్థ హెచ్చరించింది. ప్రస్తుతం ఐరోపా దేశాల్లో విమానాలకు కేవలం ఆరు వారాలకు సరిపడే ఇంధనం మాత్రమే ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సంస్థ ఉన్నతాధికారి ఫతిహ్ బిరోల్ మాట్లాడుతూ,హర్మూజ్ జలసంధిలో సమస్యలు దీర్ఘకాలం కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పారు. ద్రవ్యోల్బణం పెరగడంతో పాటు పెట్రోలు, వాయువు, విద్యుత్ ధరలు అధికమవుతాయని పేర్కొన్నారు. ముడి చమురుకు మధ్యప్రాచ్యంపై ఆధారపడే భారత్,జపాన్,కొరియా, చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలపై ముందుగా ప్రభావం పడుతుందని, అనంతరం ఐరోపా, అమెరికా దేశాలు కూడా తీవ్రంగా ప్రభావితమవుతాయని వివరించారు.