Loading...
B2B UPI payments: బీ2బీ యూపీఐ చెల్లింపులపై రూ.5 ఛార్జీ?.. ఎన్‌పీసీఐ కీలక ప్రతిపాదన
బీ2బీ యూపీఐ చెల్లింపులపై రూ.5 ఛార్జీ?.. ఎన్‌పీసీఐ కీలక ప్రతిపాదన

B2B UPI payments: బీ2బీ యూపీఐ చెల్లింపులపై రూ.5 ఛార్జీ?.. ఎన్‌పీసీఐ కీలక ప్రతిపాదన

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2026
12:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

వ్యాపార సంస్థల మధ్య జరిగే యూపీఐ (UPI) లావాదేవీలపై రూ.5 ఫ్లాట్ ఛార్జీ విధించే అంశాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు సీఎన్‌బీసీ-టీవీ18 (CNBC-TV18) ఓ కథనాన్ని ప్రచురించింది. ఎన్‌పీసీఐ యూపీఐ అండ్ సర్వీసెస్ స్టీరింగ్ కమిటీ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు నివేదిక పేర్కొంది. డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్ల మధ్య జరిగే వ్యాపార లావాదేవీలకు ఈ ఛార్జీ వర్తించనుంది. బీ2బీ ప్లాట్‌ఫామ్‌లు, మార్కెట్‌ప్లేస్‌ల ద్వారా వ్యాపారులు చేసే చెల్లింపులకూ ఇది వర్తించే అవకాశం ఉంది.

వివరాలు 

శాతం ఆధారిత ఛార్జీ కంటే రూ.5 ఫ్లాట్ ఫీజుతో ప్రయోజనం

యూపీఐ ద్వారా తరచూ సరఫరాదారులు, డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్లకు చెల్లింపులు చేసే వ్యాపార సంస్థలకు ఈ ప్రతిపాదిత ఫ్లాట్ ఫీజు వల్ల ఖర్చు తగ్గే అవకాశం ఉంది.

ప్రస్తుతం శాతం ఆధారంగా ఛార్జీలు విధిస్తే పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిపే వ్యాపారులపై అధిక భారం పడుతుంది.

ఉదాహరణకు రూ.20,000 లావాదేవీపై 0.4 శాతం ఛార్జీ విధిస్తే రూ.80 చెల్లించాల్సి ఉంటుంది.

అదే కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే ఆ లావాదేవీకి కేవలం రూ.5 మాత్రమే ఛార్జీగా చెల్లించాల్సి ఉంటుంది.

లావాదేవీ మొత్తం ఎంత ఉన్నా నిర్ణీత రూ.5 వసూలు చేయాలన్నది ఈ ప్రతిపాదన ఉద్దేశం.

వివరాలు 

బీ2బీ లావాదేవీల ఛార్జీలపై పరిశ్రమ వర్గాల ఆందోళన

డిజిటల్ చెల్లింపుల ఖర్చులపై పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

వ్యాపారుల మధ్య జరిగే చెల్లింపులను మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) పరిధి నుంచి మినహాయించాలని కోరుతూ ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ (AICPDF) గతంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసింది.

యూపీఐపై ఆధారపడి వ్యాపార లావాదేవీలు నిర్వహించే డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్లపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉందని ఆ సంస్థ తన లేఖలో పేర్కొంది.

ADVERTISEMENT

వివరాలు 

మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అంటే ఏమిటి?

డిజిటల్ చెల్లింపులను ప్రాసెస్ చేసినందుకు వ్యాపారుల నుంచి వసూలు చేసే రుసుమును మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అంటారు.

సాధారణంగా ఈ ఛార్జీని వ్యాపారులే భరిస్తారు. అనంతరం బ్యాంకులు,చెల్లింపు సేవలు అందించే సంస్థలు సహా చెల్లింపుల వ్యవస్థలోని వివిధ సంస్థల మధ్య ఈ మొత్తాన్ని పంచుతారు.

ఎన్‌పీసీఐ సెప్టెంబరులో ప్రకటించిన సవరించిన విధానం ప్రకారం..అర్హత కలిగిన రూ.2,000 కంటే ఎక్కువ విలువైన వ్యక్తి నుంచి వ్యాపారికి (P2M) జరిగే యూపీఐ లావాదేవీలపై 0.4శాతం ఎండీఆర్‌ను ప్రవేశపెట్టింది.

రూ.75,000,అంతకంటే ఎక్కువ విలువైన లావాదేవీలకు గరిష్ఠంగా రూ.300పరిమితి విధించింది.

అయితే వ్యాపారుల మధ్య జరిగే (M2M)లావాదేవీలకు ప్రత్యేక ఛార్జీల విధానాన్ని అప్పట్లో ప్రకటించలేదు.

ఇప్పుడు ఈ లావాదేవీలకు రూ.5ఫ్లాట్ ఫీజు విధించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ADVERTISEMENT