బ్యాంకు ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 17% జీతం పెంపు.. వారంలో 5రోజులే పని దినాలు
Bank employees salary hike: ప్రభుత్వ రంగ బ్యాంకుల అధికారులు, ఉద్యోగులకు శుభవార్త. బ్యాంకు ఉద్యోగుల వార్షిక వేతనం 17 శాతం పెరిగింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA), బ్యాంక్ ఉద్యోగుల సంస్థల మధ్య 17 శాతం వార్షిక వేతన పెంపుపై అంగీకారం కుదిరింది. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఏటా రూ.8,284 కోట్ల అదనపు భారం పడనుంది. బ్యాంక్ అధికారులు, ఉద్యోగుల సంస్థలతో చర్చలు జరిపిన తర్వాత ఐబీఏ వార్షిక వేతనాన్ని సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఈ వేతనం నవంబర్ 1, 2022 నుంచి అమల్లోకి రానుంది. వేతనం పెంపుతో దాదాపు ఎనిమిది లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు.
తర్వలో బ్యాంకులు వారానికి ఐదు రోజులే చేస్తాయ్
అలాగే, అన్ని శనివారాలను సెలవు దినాలుగా మంజూరు చేసేందుకు కూడా అంగీకరించినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ తెలిపింది. ప్రభుత్వ నోటిఫికేషన్ తర్వాత పని వేళల సవరణ ప్రతిపాదన అమల్లోకి రానుంది. కొత్త వేతన పరిష్కారం ప్రకారం.. మహిళా ఉద్యోగులందరూ మెడికల్ సర్టిఫికేట్ ఇవ్వకుండానే ప్రతి నెలా ఒక రోజు సిక్ లీవ్ తీసుకునేందుకు అనుమతించబడుతుంది. ఉద్యోగి పదవీ విరమణ సమయంలో లేదా సర్వీస్ సమయంలో మరణిస్తే.. ప్రివిలేజ్ లీవ్ (PL)ని 255 రోజుల వరకు ఎన్‌క్యాష్ చేసుకునేలా నిర్ణయించారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల విషయంలో, ప్రభుత్వ రంగ బ్యాంకులు చెల్లించే పెన్షన్/కుటుంబ పెన్షన్‌తో పాటు నెలవారీ ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని అదనంగా చెల్లించాలని అంగీకరించారు.