LOADING...
Bharat Taxi: దేశీయ రవాణా రంగంలో సరికొత్త విప్లవం.. భారత్‌ ట్యాక్సీని లాంచ్‌ చేసిన అమిత్‌షా..
భారత్‌ ట్యాక్సీని లాంచ్‌ చేసిన అమిత్‌షా..

Bharat Taxi: దేశీయ రవాణా రంగంలో సరికొత్త విప్లవం.. భారత్‌ ట్యాక్సీని లాంచ్‌ చేసిన అమిత్‌షా..

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 05, 2026
05:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రైవేట్ క్యాబ్ కంపెనీలైన ఓలా, ఉబర్‌, ర్యాపిడోలకు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం కొత్త యాప్‌ 'భారత్‌ ట్యాక్సీ'ను ప్రారంభించింది. ఈ యాప్‌ను గురువారం కేంద్రమంత్రి అమిత్‌ షా ప్రారంభించారు. ముందుగా పరీక్షాత్మకంగా అందించిన సేవలు విజయవంతంగా సాగిన తర్వాత సాధారణ ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రారంభంలో ఈ సేవలు దిల్లీ-ఎన్‌సీఆర్,గుజరాత్ రాష్ట్రాల్లో లభిస్తాయి. రాబోయే మూడు సంవత్సరాల్లో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు, అలాగే ద్వారక నుంచి కామాఖ్యా (అస్సాం) వరకు భారత్‌ ట్యాక్సీ సేవలను విస్తరించేందుకు కేంద్రం యత్నిస్తున్నట్లు అమిత్‌ షా తెలిపారు. డ్రైవర్లకు పూర్తి లాభాలు అందించే విధంగా ప్లాట్‌ఫామ్ రూపొందించబడిందని పేర్కొన్నారు. ఇందులో కారు, త్రీవీలర్, టూవీలర్ రైడ్‌లను బుక్‌ చేసుకోవచ్చు.

వివరాలు 

జీరో కమీషన్ విధానం

దేశంలో క్యాబ్ బుకింగ్‌లో ఉబర్‌, ఓలా, ర్యాపిడో కీలక భూమిక పోషిస్తున్నాయి. అయితే డ్రైవర్ల నుంచి ఈ సంస్థలు కొంత కమీషన్ వసూలు చేస్తుంటాయి. అనేకమంది డ్రైవర్లు తమ శ్రమను కంపెనీలు సముచితంగా గుర్తించకపోవడం వలన ఫిర్యాదులు చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో, మల్టీ-స్టేట్ కోపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద, కేంద్ర ప్రభుత్వం 2025 జూన్ 5న 'భారత్‌ ట్యాక్సీ'ను రూపొందించింది. జీరో కమీషన్ విధానం, సర్జ్‌ ప్రైసింగ్ లేకపోవడం, డ్రైవర్లకు లాభాలను నేరుగా అందించడం దీని ప్రధాన లక్ష్యంగా ఉంది.

వివరాలు 

ఈ ప్లాట్‌ఫామ్‌లో 3 లక్షల మంది డ్రైవర్లు

ప్రారంభంలో దిల్లీ-ఎన్‌సీఆర్, గుజరాత్‌లో డిసెంబర్ 2 నుంచి ప్రయోగాత్మకంగా సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు 3 లక్షల మంది డ్రైవర్లు ఈ ప్లాట్‌ఫామ్‌లో చేరగా, లక్షల సంఖ్యలో యూజర్లు రిజిస్టర్ అయ్యారు. రోజుకు సుమారు 10,000 రైడ్లు జరిగాయి. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ప్రకారం, డ్రైవర్లకు లభించిన లాభాలు సుమారు 10 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. అదనంగా, డ్రైవర్లకు 'సారథి' పేరుతో ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, రిటైర్మెంట్ సేవింగ్స్ వంటి ప్రయోజనాలు కూడా అందించబడతాయి.

Advertisement