Bharti Airtel: డిజిటల్ టీవీ సెగ్మెంట్‌లో భారతీ ఎయిర్‌టెల్ దూకుడు.. టాటా ప్లేని కొనుగోలు చేసేందుకు చర్చలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్ టెల్ తన డిజిటల్ టీవీ విభాగాన్ని విస్తరించేందుకు కసరత్తు చేస్తోంది.
ఇందులో భాగంగా దేశంలో అతిపెద్ద డైరెక్ట్ టు హోమ్ (DTH) సర్వీస్ ప్రొవైడర్ టాటా ప్లేని కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంది.
ఈ క్రమంలోనే టాటా గ్రూప్‌తో చర్చలు జరుపుతోందని 'ఎకనామిక్ టైమ్స్' వెల్లడించింది.
ఓవర్-ది-టాప్ (OTT)స్ట్రీమింగ్ సేవలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్‌టెల్ తన డిజిటల్ టీవీ విభాగాన్ని బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతో టాటా ప్లేని కొనుగోలు చేసే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం.
ఈ ఒప్పందం కుదిరితే,టాటా తన కంటెంట్,ఎంటర్‌టైన్‌మెంట్ కార్యకలాపాల నుంచి వైదొలగాల్సి ఉంటుంది.
2017లో టాటా తన మొబిలిటీ వ్యాపారాన్ని ఎయిర్‌టెల్‌కు విక్రయించిన తర్వాత,ఇది రెండో పెద్ద ఒప్పందంగా నిలుస్తుంది.
వివరాలు
డీటీహెచ్‌కు బదులుగా హోమ్ బ్రాడ్‌బ్యాండ్,ఓటీటీ ప్యాకేజీ
ప్రస్తుతం టాటా ప్లే 20.77 మిలియన్ల సబ్‌స్క్రైబర్లతో, 32.7 శాతం మార్కెట్ వాటాతో DTH విభాగంలో ప్రధాన స్థానాన్ని ఆక్రమిస్తోంది.
కానీ, 2024 ఆర్థిక సంవత్సరంలో టాటా ప్లేకి రూ.353.8 కోట్ల నష్టం వచ్చింది.
మరోవైపు, ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ విభాగం కూడా నష్టాలనే ఎదుర్కొంటూ, సబ్‌స్క్రైబర్లను పెంచుకుంటూ 27.8 శాతం మార్కెట్ వాటా సాధించింది.
టాటా ప్లే కొనుగోలు చేయడం వల్ల ఎయిర్‌టెల్ కస్టమర్ బేస్ పెరుగుతుందని, జియో వంటి సంస్థలతో పోటీపడే శక్తి పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు.
అలాగే, టైర్-1, టైర్-2 నగరాల వినియోగదారులు డీటీహెచ్‌కు బదులుగా హోమ్ బ్రాడ్‌బ్యాండ్, ఓటీటీ ప్యాకేజీలను ఎంచుకుంటున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో దూరదర్శన్ ఫ్రీ డిష్ ప్రాధాన్యత పెరుగుతుందనే నివేదికలు కూడా ఉన్నాయి.