
Home loan: గృహ రుణ వినియోగదారులకు ఆర్‌బీఐ గుడ్‌న్యూస్.. దీంతో ఈఎంఐ భారం ఎంత తగ్గనున్నదంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
గృహ రుణ వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఎట్టకేలకు శుభవార్త అందించింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించేందుకు నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణాన్ని సమతుల్యం చేస్తూనే ఆర్థిక వృద్ధికి ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్ బి ఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఈ ప్రతిపాదనను మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. తాజా నిర్ణయంతో రెపో రేటు 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గింది. గత ఐదేళ్లుగా వడ్డీ రేట్లు పెరుగుతూనే ఉండటంతో, తగ్గింపు చూడని హోమ్‌లోన్ కస్టమర్లకు ఇది ఎంతో ఊరటనిచ్చే అంశం. దీని ఫలితంగా ఈఎంఐ కూడా తగ్గనుంది.
వివరాలు
వడ్డీ ఎంత తగ్గనుంది?
రెపో రేటులో 25 బేసిస్ పాయింట్ల (0.25%) తగ్గింపుతో గృహ రుణ వినియోగదారుల నెలవారీ ఈఎంఐలో స్పష్టమైన తేడా కనిపించనుంది. ఉదాహరణకు, 20 ఏళ్ల కాలవ్యవధికి రూ.50 లక్షల రుణం తీసుకున్నట్లయితే, ప్రస్తుత 9% వడ్డీ రేటుతో నెలకు రూ.44,986 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, రెపో రేటు తగ్గింపుతో వడ్డీ రేటు తగ్గడం వల్ల ఇకపై రూ.44,186 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అంటే, నెలకు దాదాపు రూ.800 ఆదా అవుతుంది. గృహ రుణం పూర్తయ్యేందుకు ఇంకా 10 సంవత్సరాల సమయం ఉందనుకుంటే, ఈ తగ్గింపుతో 120 నెలల పాటు రూ.800 చొప్పున దాదాపు రూ.96,000 వరకు ఆదా అవుతుంది.
వివరాలు
రుణ గ్రహీతల ముందున్న రెండు ఆప్షన్లు
ఆర్‌బీఐ రెపో రేటు తగ్గింపుతో రుణ గ్రహీతల ముందు రెండు ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి: ఈఎంఐ మొత్తాన్ని తగ్గించుకోవడం కాలవ్యవధిని తగ్గించుకోవడం నిపుణుల సూచన ప్రకారం, రెండో ఆప్షన్ ఎంచుకోవడం మంచిది, ఎందుకంటే దీని ద్వారా దీర్ఘకాలంలో ఎక్కువ మొత్తంలో వడ్డీని ఆదా చేసుకోవచ్చు. ఉదాహరణగా,రూ.50 లక్షల రుణంపై 9% వడ్డీతో 20 ఏళ్లకు మొత్తం రూ.57.96 లక్షలు వడ్డీగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే,తాజా తగ్గింపుతో వడ్డీ రేటు 8.75%కి చేరితే,ఈఎంఐ మొత్తం మారకుండా కొనసాగిస్తే,రుణ కాలవ్యవధి దాదాపు 10 నెలలు తగ్గిపోతుంది. దీంతో మొత్తం వడ్డీ రూ.53.6 లక్షలకు తగ్గిపోతుంది,అంటే దాదాపు రూ.4 లక్షలకుపైగా ఆదా అవుతుంది. అందువల్ల, రుణ కాలవ్యవధిని తగ్గించుకోవడం ఉత్తమ ఎంపిక అని నిపుణులు సూచిస్తున్నారు.