LOADING...
Bikaji: బికాజీ వ్యవస్థాపకుడు శివ్‌ రతన్‌ అగర్వాల్‌ కన్నుమూత
బికాజీ వ్యవస్థాపకుడు శివ్‌ రతన్‌ అగర్వాల్‌ కన్నుమూత

Bikaji: బికాజీ వ్యవస్థాపకుడు శివ్‌ రతన్‌ అగర్వాల్‌ కన్నుమూత

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 23, 2026
04:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

బికాజీ ఫుడ్స్‌ ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపకుడు, ప్రమోటర్‌ శివ్‌ రతన్‌ అగర్వాల్‌ (75) గురువారం కన్నుమూశారు. ఈ మేరకు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. సాధారణ అల్పాహార పదార్థాలు, మిఠాయిల వ్యాపారాన్ని 'బికాజీ' పేరిట అంతర్జాతీయ స్థాయి బ్రాండ్‌గా తీర్చిదిద్దిన వ్యక్తిగా ఆయన నిలిచారని సంస్థ పేర్కొంది. తన ప్రత్యేక వ్యూహాలతో సంస్థకు దృఢమైన పునాదులు వేసిన అగర్వాల్‌ మరణం సంస్థకు పూడ్చలేని లోటని తెలిపింది.

వివరాలు 

స్కూల్‌ డ్రాపౌట్‌ To ₹13వేల కోట్ల సామ్రాజ్యం:

రాజస్థాన్‌లోని బికనేర్‌లో జన్మించిన శివ్‌ రతన్‌ అగర్వాల్‌ 1986లో 'శివ్‌దీప్‌ ప్రొడక్ట్స్‌'ను ప్రారంభించారు. అనంతరం 1993లో అదే సంస్థ 'బికాజీ ఫుడ్స్‌ ఇంటర్నేషనల్‌'గా రూపాంతరం చెందింది. చదివింది ఎనిమిదో తరగతే అయినా బికనేర్‌ రుచులను తనదైన తయారీ, మార్కెటింగ్‌ వ్యూహాలతో అగర్వాల్‌ ముందుకు నడిపించారు. ఈ క్రమంలో దేశంలోనే ప్రముఖ ప్యాకేజ్డ్‌ అల్పాహార తయారీ సంస్థగా బికాజీ ఎదిగింది. ప్రస్తుతం సంస్థ మార్కెట్‌ విలువ రూ.13,430 కోట్లుగా ఉంది. భారత్‌తో పాటు విదేశీ మార్కెట్లలోనూ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. భుజియా, నమకీన్‌, మిఠాయిలు, ప్యాకేజ్డ్‌ అల్పాహారాలను విక్రయిస్తోంది. 2022లో పబ్లిక్‌ ఇష్యూ ద్వారా పెట్టుబడులను సమీకరించింది. 2024లో ప్రపంచ సంపన్నుల జాబితాలో అగర్వాల్‌ స్థానం సంపాదించడం విశేషం.

Advertisement