Bill Gates: భారత్‌పై బిల్‌గేట్స్ మరోసారి ప్రశంసలు.. మూడేళ్లలో మూడోసారి పర్యటన
ఈ వార్తాకథనం ఏంటి
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారత్‌తో తన అనుబంధాన్ని మళ్లీ గుర్తుచేసుకున్నారు. త్వరలో భారత్ పర్యటనకు రానున్న సందర్భంగా, మన దేశాన్ని మరోసారి ప్రశంసలతో ముంచెత్తారు.
ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, డిజిటల్ పరివర్తన వంటి కీలక రంగాల్లో భారత్ చేస్తున్న ప్రగతిని అభినందించారు. సరికొత్త ఆవిష్కరణలతో దేశం అద్భుతమైన పురోగతి సాధిస్తోందని పేర్కొన్నారు.
గత మూడేళ్లలో మూడోసారి భారత్‌ను సందర్శించనున్నట్లు బిల్ గేట్స్ లింక్డిన్‌లో వెల్లడించారు.
ఈ సందర్భంగా, భారత్ చేపట్టిన ఆరోగ్య కార్యక్రమాలను ప్రస్తావిస్తూ, పోలియో నిర్మూలనలో దేశం అందించిన అసాధారణ ప్రదర్శనను ప్రశంసించారు.
Details
క్షయ నిర్మూలనకు కృషి
2011లో భారత్ చివరి పోలియో కేసును నమోదు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అలాగే, హెచ్‌ఐవీ నివారణకు చేపట్టిన 'అవాహన్' వంటి కార్యక్రమాలను కొనియాడారు.
ప్రస్తుతం భారత్ క్షయ వ్యాధి (TB) నిర్మూలనకు తీవ్రంగా పోరాడుతోందని, టీకాల తయారీ, రోగ నిర్ధారణ వంటి వైద్య రంగాల్లో దేశ సామర్థ్యం విశేషంగా పెరిగిందని తెలిపారు.
భారతీయ కంపెనీలు అభివృద్ధి చేసిన టీబీ నిర్ధారణ పరీక్షలు, ఆఫ్రికాలో ఈ వ్యాధి నియంత్రణలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అంతేగాక, బ్యాంకింగ్, ప్రభుత్వ సేవలు, డిజిటల్ చెల్లింపుల (Digital Payments) వ్యవస్థలో భారత్ అనుసరిస్తున్న ఆవిష్కరణలను గేట్స్ ప్రశంసించారు.
Details
రైతులకు గొప్ప ప్రయోజనం
వ్యవసాయ రంగంలో సాంకేతికత ప్రాముఖ్యత పెరుగుతోందని, ప్రత్యేకంగా వాతావరణాన్ని అంచనా వేసే విధానాలు, పంటల ఎంపిక, చీడపీడల నియంత్రణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఎంతగానో ఉపయోగపడుతోందని వివరించారు.
ఈ సాంకేతికత ఆసియా వ్యాప్తంగా రైతులకు గొప్ప ప్రయోజనం కలిగిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
తాజా పర్యటనలో, భారత అభివృద్ధి పథంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రభుత్వ అధికారులు, శాస్త్రవేత్తలతో చర్చలు జరిపే అవకాశం ఉందని బిల్ గేట్స్ వెల్లడించారు.
సామాజిక అసమానతలు, పేదరికం వంటి సమస్యలను సమర్థంగా ఎదుర్కోవడానికి గేట్స్ ఫౌండేషన్ గత 25 ఏళ్లుగా కృషి చేస్తోందని గుర్తుచేశారు.