
Nvidia CEO Jensen Huang: నా మేనేజ్‌మెంట్ బృందంలోనే బిలియనీర్లు తయారయ్యారు: జెన్సన్ హువాంగ్ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. "నా మేనేజ్‌మెంట్ బృందంలోనే పెద్ద ఎత్తున బిలియనీర్లు తయారయ్యారు. ప్రపంచంలో మరే ఇతర సీఈవోకు ఇది సాధ్యపడలేదని ఆయన గర్వంగా ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు ఆయన ఆల్-ఇన్ పాడ్‌కాస్ట్ బృందం, హిల్ అండ్ వ్యాలీ ఫోరమ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో భాగంగా చేశారు. హువాంగ్ మాట్లాడుతూ, చిన్న చిన్న కృత్రిమ మేధ(AI) పరిశోధక బృందాలే ఎన్విడియాను విజయపథంలో నడిపాయని వివరించారు. "150 మంది పరిశోధకుల బృందం ఉంటే, వారికి సరైన ఫండింగ్ దొరికితే, వారు అద్భుతాలు సాధించగలరు. 20-30 బిలియన్ డాలర్లు ఇవ్వగలిగే కంపెనీలు, ఈ బృందాలకు పెట్టుబడి పెట్టడంలో ఏమాత్రం వెనుకాడకూడదు" అని సూచించారు.
Details
150 మందితో అద్భుతాలు సృష్టించాం
ఓపెన్‌ఏఐ వంటి సంస్థలు ప్రారంభంలో 150 మందితోనే అద్భుతాలు సాధించాయని గుర్తు చేశారు. చైనాలోని డీప్‌సీక్ కూడా అంతే సంఖ్యలోనే సిబ్బందితో గొప్ప ప్రయోగాలు చేస్తోందని ఉదాహరణగా చెప్పారు. ఇక ఎన్విడియాలో అద్భుతంగా పనిచేసే ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్స్,రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్స్‌ను ఇచ్చే విధానంపై సరదాగా స్పందించారు హువాంగ్. వాటిని నా జేబులో నుంచే ఇస్తున్నానంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు.ఉద్యోగుల కాంపెన్సేషన్‌ను స్వయంగా సమీక్షిస్తానని, ఇందుకోసం ప్రత్యేకమైన శైలి పాటిస్తానని తెలిపారు. మెషీన్ లెర్నింగ్ సహాయంతో తాను వ్యయాలను విశ్లేషిస్తానని చెప్పారు. సంస్థ నిర్వహణ వ్యయాలు పెరిగినప్పటికీ, ఉద్యోగుల సంక్షేమం కోసం ఇది అవసరమని హువాంగ్ పేర్కొన్నారు. ఈవ్యాఖ్యల ద్వారా జెన్సన్ హువాంగ్ తన నాయకత్వ దృక్పథాన్ని,ఉద్యోగుల పట్ల చూపుతున్న నిబద్ధతను స్పష్టం చేశారు.