Aircraft manufacturing: దేశీయ విమాన పరిశ్రమకు బూస్ట్.. అదానీ, ఎంబ్రయర్ మధ్య కీలక ఒప్పందం
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో విమాన తయారీ రంగాన్ని బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. దేశీయంగా ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీ లక్ష్యంగా అదానీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ ఎంబ్రయర్ మధ్య ముఖ్యమైన ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఈ ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని ఆయన తెలిపారు. దేశంలో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా విమానాల తయారీ చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యంగా చిన్న, దేశీయ (డొమెస్టిక్) ఎయిర్‌క్రాఫ్ట్‌లకు ప్రస్తుతం భారీ డిమాండ్ ఉందన్నారు. దేశీయంగా విమానాలను తయారు చేయాలన్న ఆలోచనతో సాగుతున్న ప్రయత్నాల్లో భాగంగానే ఈ రోజు కీలక ఎంఓయూ కుదిరింది.
Details
ఐదు లక్షల మంది విమాన ప్రయాణం చేస్తున్నారు
అదానీ ఏరోస్పేస్, బ్రెజిల్ సంస్థ ఎంబ్రయర్ కలిసి భారత్‌లో ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీకి ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాయి. దీనికి పౌర విమానయాన శాఖ తరఫున పూర్తి సహకారం అందించామని రామ్మోహన్ నాయుడు వివరించారు. ప్రస్తుతం దేశంలో రోజుకు సగటున ఐదు లక్షల మంది విమాన ప్రయాణం చేస్తున్నారని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో 80 నుంచి 150 సీట్ల సామర్థ్యం గల విమానాల సెగ్మెంట్‌కు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోందన్నారు. ప్రస్తుతం అవసరమైన విమానాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, అదే దేశీయంగా తయారు చేయగలిగితే ఆర్థికంగా అన్ని విధాలా లాభం చేకూరుతుందని తెలిపారు.
Details
పౌర విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోంది
ఈ ఒప్పందం ద్వారా దేశీయ యువతకు, ముఖ్యంగా ఇంజినీరింగ్, ఉన్నత నైపుణ్యాలు కలిగిన వారికి పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలు లభిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే నెలలో బ్రెజిల్ అధ్యక్షుడు భారత్‌కు రానున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో జరగనున్న భేటీలో ఈ అంశంపై మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించనున్న 'వింగ్స్ ఇండియా' కార్యక్రమంలో ఎంబ్రయర్ తయారు చేసిన విమానాన్ని ప్రదర్శనకు ఉంచాలని సంస్థను సూచించామని, దీనికి సంబంధించి ఎంబ్రయర్ చర్యలు తీసుకున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. పౌర విమానయాన రంగం వేగంగా విస్తరిస్తున్న దేశాల్లో భారత్ ఒకటిగా నిలుస్తోంది.