Oil Prices: భగ్గుమన్న ముడి చమురు ధరలు.. 100 డాలర్ల మార్క్ దాటిన బ్రెంట్ క్రూడ్
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. ప్రపంచ చమురు మార్కెట్‌కు కీలక సూచికగా భావించే బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్ల మార్క్‌ను దాటింది. మే నెల తర్వాత ఈ స్థాయిని చేరుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 6.60 శాతానికి పైగా పెరిగి 100.68 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్ (WTI) క్రూడ్ ధర కూడా పెరిగి బ్యారెల్‌కు 91.84 డాలర్ల వద్ద కొనసాగుతోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు మరింత పెరిగితే ముడి చమురు ధరలు ఇంకా ఎగిసే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
వివరాలు
అంతర్జాతీయ మార్కెట్లలో చమురు సరఫరాపై ఆందోళనలు
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న పరస్పర దాడుల ప్రభావంతో ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హర్మూజ్ జలసంధి మార్గంలో నౌకల రాకపోకలు మందగించాయి.
దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు సరఫరాపై ఆందోళనలు పెరిగాయి.
ఇదే సమయంలో ఎర్రసముద్రంలో సౌదీ అరేబియాకు చెందిన చమురు ట్యాంకర్లపై హుతీ తిరుగుబాటుదారులు దాడులు జరపడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది.
ఈ పరిణామాలతో ప్రపంచ మార్కెట్‌లో చమురు సరఫరాపై అనిశ్చితి నెలకొనడంతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి.
ఫలితంగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 100 డాలర్ల మార్క్‌ను అధిగమించింది.
వివరాలు
చమురు ధరల్లో మరింత హెచ్చుతగ్గులు నమోదయ్యే అవకాశం
చమురు ధరల ఈ పెరుగుదల ప్రభావం అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లపైనా కనిపిస్తోంది.
అమెరికా స్టాక్ మార్కెట్లలో డౌ జోన్స్, ఎస్‌అండ్‌పీ 500, నాస్‌డాక్ సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగినంతకాలం చమురు ధరల్లో మరింత హెచ్చుతగ్గులు నమోదయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.