Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెయ్ సూచీలు.. 1092 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ షేర్ మార్కెట్లు వారాంతంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం వరకు సానుకూలంగానే కొనసాగినా, చివరి గంటలో అమ్మకాల ఒత్తిడి ఒక్కసారిగా పెరగడంతో భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ పరిణామాలు, విదేశీ మదుపర్ల విక్రయాలు, వర్షాకాలంపై నెలకొన్న ఆందోళనలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో సెన్సెక్స్ రోజువారీ గరిష్ఠ స్థాయి నుంచి దాదాపు 1,300 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ 23,550 దిగువన ముగిసింది. మార్కెట్ పతనం కారణంగా మదుపర్ల సంపదలో సుమారు రూ.5 లక్షల కోట్ల క్షీణత చోటుచేసుకుని, మొత్తం మార్కెట్ విలువ రూ.466 లక్షల కోట్లకు పడిపోయింది. ముంబయి స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 75,988.51 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.
వివరాలు
నిఫ్టీ@ 23,547.75
ట్రేడింగ్ సమయంలో 76,220.02 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన సూచీ, అనంతరం అమ్మకాల ఒత్తిడితో క్రమంగా దిగజారింది. ఒక దశలో 74,589.11 పాయింట్ల కనిష్ఠ స్థాయికి చేరుకున్న సెన్సెక్స్, చివరకు 1,092.06 పాయింట్ల నష్టంతో 74,775.74 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 359.40 పాయింట్లు కోల్పోయి 23,547.75 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి డాలరుతో రూపాయి మారక విలువ 95.05గా నమోదైంది. సెన్సెక్స్‌లోని ప్రధాన షేర్లలో టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎల్‌అండ్‌టీ, ఇన్ఫోసిస్ కొంతమేర నిలదొక్కుకోగా, మిగిలిన చాలా కంపెనీల షేర్లు నష్టాల్లో ముగిశాయి.
వివరాలు
బంగారం ధర ఔన్సుకు 4,530 డాలర్లు
ముఖ్యంగా పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఇండిగో, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్ షేర్లలో అమ్మకాలు ఎక్కువగా కనిపించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 91.40 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ధర ఔన్సుకు 4,530 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మార్కెట్ పతనానికి ప్రధాన కారణంగా అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై కొనసాగుతున్న అనిశ్చితిని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాల్పుల విరమణను పొడిగించడం, అణు కార్యక్రమానికి సంబంధించిన చర్చలను ప్రారంభించడం వంటి అంశాలపై ఇరు దేశాల ప్రతినిధులు తాత్కాలిక అవగాహనకు చేరువైనట్లు వార్తలు వచ్చినప్పటికీ, దీనికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం అవసరమనే సమాచారం మదుపర్లలో సందిగ్ధతను పెంచింది.
వివరాలు
మదుపర్లను అప్రమత్తం చేసిన వాతావరణ శాఖ అంచనాలు
ఒకవైపు చర్చలు కొనసాగుతుండగా, మరోవైపు ఇరు దేశాలు దాడులు, ప్రతిదాడులకు పాల్పడుతుండటం ఆందోళనలకు కారణమవుతోంది. దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత మదుపర్లు నిధులను ఉపసంహరించుకోవడం కూడా మార్కెట్‌పై ఒత్తిడిని పెంచుతోంది. బుధవారం ఒక్కరోజే విదేశీ మదుపర్లు రూ.1,040కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. గత ఏడాదితో పోలిస్తే ఈఏడాది ప్రారంభం నుంచే విదేశీ మదుపర్ల విక్రయాలు మరింత వేగంగా కొనసాగుతుండటం మార్కెట్‌కు ప్రతికూల సంకేతాలను ఇస్తోంది. ఇక ఈ వర్షాకాలంలో సాధారణ స్థాయి కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అంచనాలు కూడా మదుపర్లను అప్రమత్తం చేశాయి. వ్యవసాయ రంగం,గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడొచ్చన్నఆందోళనలతో మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి మరింత పెరిగినట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.