Budget 2026:రూ.12 లక్షల వరకూ పన్ను మినహాయింపు తర్వాత.. బడ్జెట్ 2026లో ఇంకేం మార్పులు ఉండనున్నాయా?
ఈ వార్తాకథనం ఏంటి
ఫిబ్రవరి 1, ఆదివారం రోజున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూనియన్ బడ్జెట్ 2026ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ పన్ను చెల్లింపుదారులకు ఎంతో కీలకంగా మారింది. ఎందుకంటే, ఈ ఏడాది పన్ను సంస్కరణలపై మంత్రి కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. ఇవి నేరుగా కోట్లాది మంది పన్ను దాతలపై ప్రభావం చూపనున్నాయి. బడ్జెట్ 2020లో కేంద్ర ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని(New Tax Regime)ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి పన్ను చెల్లింపుదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పలుమార్లు మార్పులు చేసింది. ముఖ్యంగా బడ్జెట్ 2025లో ఆదాయపన్ను రేట్లను తగ్గిస్తూ,ఏడాదికి రూ.12లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పన్ను భారం లేకుండా చేయడం పెద్ద నిర్ణయంగా నిలిచింది.
వివరాలు
బడ్జెట్ 2026లో ఆదాయపన్ను రంగంలో మరిన్ని మార్పులు ఉంటాయా?
అయితే ఈ సడలింపులు పూర్తిగా కొత్త పన్ను విధానానికే వర్తించాయి. గత కొన్ని సంవత్సరాల్లో కొత్త పన్ను విధానాన్ని మరింత సులభంగా మార్చేందుకు పన్ను స్లాబ్‌లలో మార్పులు చేశారు. అయితే బడ్జెట్ 2026లో ఆదాయపన్ను రంగంలో మరిన్ని మార్పులు ఉంటాయా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గ్రాంట్ థార్న్టన్ భారత్‌లో ట్యాక్స్ పార్ట్నర్‌గా ఉన్న రిచా సావ్నీ అభిప్రాయం ప్రకారం, గత ఏడాది తీసుకున్న కీలక నిర్ణయాల దృష్ట్యా కొత్త పన్ను విధానంలో పెద్ద ఎత్తున మార్పులు చేయడం ప్రభుత్వానికి అంత సులభం కాకపోవచ్చు.
వివరాలు
కొత్త పన్ను విధానం మరింత ఆకర్షణీయంగా మారాలంటే?
బడ్జెట్ 2026లో కొత్త పన్ను విధానాన్ని ప్రజలకు మరింత నచ్చేలా చేయాలంటే స్పష్టత, స్థిరత్వం, క్రమబద్ధమైన అమలు అవసరమని ఫోర్విస్ మజార్స్ ఇండియాలో డైరెక్ట్ ట్యాక్స్ పార్ట్నర్ గౌరవ్ జైన్ సూచించారు. లైవ్‌మింట్‌తో మాట్లాడుతూ, కొత్త ఆదాయపన్ను చట్టం 2025 విజయవంతం కావాలంటే అధికారాల వినియోగంలో నియంత్రణ, సాంకేతిక తప్పిదాలపై క్రిమినల్ కేసులు తగ్గించడం, ఉద్దేశపూర్వక మోసం ఉన్న సందర్భాల్లోనే కేసులు పెట్టడం అవసరమని అన్నారు. అలాగే అప్పీళ్ల ప్రక్రియను వేగవంతం చేయడం, ఫేస్‌లెస్ అప్పీల్ వ్యవస్థను మెరుగుపరచడం, ఇప్పటికే స్థిరపడిన న్యాయ నిర్ణయాలను ఒకేలా అమలు చేయడం వల్ల వివాదాలు తగ్గుతాయని, పన్ను చెల్లింపుదారుల్లో నమ్మకం పెరుగుతుందని గౌరవ్ జైన్ తెలిపారు.
వివరాలు
బడ్జెట్ 2026లో కొత్త పన్ను విధానాన్ని మరింత బలోపేతం చేసే అవకాశం
రిచా సావ్నీ అభిప్రాయం ప్రకారం,జీవన వ్యయాలు,ద్రవ్యోల్బణం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రతి సంవత్సరం పన్ను స్లాబ్‌లను స్వల్పంగా సవరించే విధానం తీసుకువస్తే,అది పెద్ద సంఖ్యలో పన్ను చెల్లింపుదారులకు లాభం చేకూరుస్తుందని,కొత్త పన్ను విధానానికి మరింత ఆదరణ పెరుగుతుందని తెలిపారు. పెటానిక్ ఏఐ సహ వ్యవస్థాపకుడు, సీఓఓ యశ్రాజ్ భరద్వాజ్ మాట్లాడుతూ, బడ్జెట్ 2026లో కొత్త పన్ను విధానాన్ని మరింత బలోపేతం చేసే అవకాశం ఉందన్నారు. పన్ను స్లాబ్‌లను సరళీకరించడం, ప్రాథమిక మినహాయింపు పరిమితిని పెంచడం, పరిమితమైన కానీ ప్రయోజనకరమైన డిడక్షన్లు ఇవ్వడం ద్వారా ప్రజల చేతిలో మిగిలే ఆదాయం పెరుగుతుందని ఆయన చెప్పారు. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పన్ను పరిమితులను సవరించడం వల్ల కొత్త విధానాన్ని ఎక్కువ మంది స్వీకరించే అవకాశం ఉందన్నారు.
వివరాలు
గృహ రుణ డిడక్షన్లను తిరిగి తీసుకురావాలి: నిపుణులు
కొత్త పన్ను విధానంలో గృహ కొనుగోలుదారులకు మళ్లీ డిడక్షన్లు ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. క్లియర్‌ట్యాక్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ ఆర్చిత్ గుప్తా మాట్లాడుతూ, ఆదాయపన్ను చట్టం 1961లోని సెక్షన్ 24(b)ను కొత్త పన్ను విధానంలో కూడా వర్తింపజేయాలని అన్నారు. ఈ సెక్షన్ ప్రకారం, స్వంత నివాస గృహంపై తీసుకున్న హోమ్ లోన్ వడ్డీపై రూ.2 లక్షల వరకు డిడక్షన్ పొందే అవకాశం ఉంటుంది. కొత్త పన్ను విధానం నిజంగా ప్రజల డిఫాల్ట్ ఎంపికగా మారాలంటే, భారతీయుల ఆశయాలను ప్రతిబింబించాల్సిందేనని ఆర్చిత్ గుప్తా వ్యాఖ్యానించారు. గృహ స్వంతత్వం విషయంలో సెక్షన్ 24(b)ను తిరిగి తీసుకురావడం చాలా అవసరమని చెప్పారు.
వివరాలు
హోమ్ లోన్ వడ్డీపై డిడక్షన్ అందిస్తే..
కొత్త పన్ను విధానంలో హోమ్ లోన్ వడ్డీపై డిడక్షన్ అందిస్తే గృహ రుణాల ఖర్చు తగ్గుతుందని గుప్తా అభిప్రాయపడ్డారు. ఇళ్ల ధరలు పెరుగుతున్న ఈ పరిస్థితుల్లో, గృహ కొనుగోలుదారులకు స్పష్టమైన, స్థిరమైన పన్ను మద్దతు ఇవ్వడం వల్ల కొత్త పన్ను విధానం కేవలం సులభంగా ఫైల్ చేసే విధానంగానే కాకుండా, ఆర్థికంగా కూడా ఆకర్షణీయంగా మారుతుందని ఆయన తెలిపారు.