LOADING...
Budget 2026: బడ్జెట్‌-2026పై దేశం మొత్తం దృష్టి.. ఆదాయపు పన్ను స్లాబ్‌ల్లో కీలక మార్పులు ఉంటాయా?
ఆదాయపు పన్ను స్లాబ్‌ల్లో కీలక మార్పులు ఉంటాయా?

Budget 2026: బడ్జెట్‌-2026పై దేశం మొత్తం దృష్టి.. ఆదాయపు పన్ను స్లాబ్‌ల్లో కీలక మార్పులు ఉంటాయా?

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 15, 2026
12:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరి దృష్టి రాబోయే కేంద్ర బడ్జెట్‌పైనే కేంద్రీకృతమైంది. బడ్జెట్‌-2026 అనంతరం అనేక రంగాలపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నట్లు అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించి బడ్జెట్ సమావేశాల షెడ్యూల్‌ను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసింది. దేశీయ డిమాండ్‌ను బలపర్చే దిశగా గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఆదాయపు పన్ను రాయితీలు, GST సరళీకరణపై ప్రభుత్వం ఎక్కువ దృష్టి సారిస్తుందనే అంచనాలు వినిపిస్తున్నాయి.

వివరాలు 

వ్యక్తిగత ఆదాయపు పన్ను స్లాబ్‌ల పునర్నిర్మాణంపై పెద్దఎత్తున చర్చ

ఇక వ్యక్తిగత ఆదాయపు పన్ను స్లాబ్‌ల పునర్నిర్మాణంపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. 2025 డిసెంబర్ నాటికి నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.17 లక్షల కోట్లకు మించి ఉండటం, ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసిన వారి సంఖ్య 9.2 కోట్లకు చేరుకోవడం స్లాబ్ పరిమితుల పునఃసమీక్షకు ఊతమిస్తోంది. ప్రస్తుత పన్ను వ్యవస్థలో 'బ్రాకెట్ క్రీప్' కారణంగా పన్ను చెల్లింపుదారులపై భారం పెరిగే పరిస్థితి ఉందని బ్యాంక్‌బజార్ సీఈఓ ఆదిల్ శెట్టి వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణం క్రమంగా వాస్తవ ఆదాయాలను తగ్గిస్తుంటే, పన్ను స్లాబ్ పరిమితులు అదే స్థాయిలో కొనసాగుతుండటమే ఇందుకు కారణమని ఆయన వివరించారు.

వివరాలు 

ఆదాయంపై నిరంతర ఒత్తిడి

2020 నుంచి వినియోగ ధరల సూచిక దాదాపు 21 శాతం పెరిగినా, 30 శాతం పన్ను స్లాబ్ పరిమితి మాత్రం సుమారు రూ.15 లక్షల వద్దనే కొనసాగుతోందని శెట్టి తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో జీతాలు పొందే కుటుంబాలకు జీవన వ్యయాలు ఏటా 7 నుంచి 8 శాతం వరకు పెరుగుతున్నాయని, దీని వల్ల వినియోగించుకునే ఆదాయంపై నిరంతర ఒత్తిడి ఏర్పడుతోందని అన్నారు. ద్రవ్యోల్బణానికి అనుసంధానంగా స్లాబ్‌లను సూచికీకరణ చేయడం ద్వారా అగ్ర పన్ను పరిమితిని రూ.18 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు పెంచే అవకాశాన్ని పరిశీలించవచ్చని సూచించారు.

Advertisement

వివరాలు 

ఆదాయపు పన్ను వసూళ్లలో 2 శాతం పన్ను చెల్లింపుదారుల నుంచే.. 

అలాగే రూ.4 నుంచి రూ.8 లక్షల ఆదాయంపై 5 శాతం, రూ.8 నుంచి రూ.12 లక్షలపై 10 శాతం, రూ.12 నుంచి రూ.16 లక్షలపై 15 శాతం పన్ను విధించేలా మధ్యస్థ స్లాబ్‌లను విస్తరించడం ద్వారా ప్రగతిశీల నిర్మాణాన్ని మరింత సజావుగా కొనసాగించవచ్చని చెప్పారు. ప్రస్తుతం మొత్తం ఆదాయపు పన్ను వసూళ్లలో సుమారు 77 శాతం కేవలం 2 శాతం పన్ను చెల్లింపుదారుల నుంచే వస్తున్నట్లు డేటా సూచిస్తోందని, ఈ పరిస్థితిలో సమానత్వం-సామర్థ్యం మధ్య సమతుల్యం సాధించడమే లక్ష్యంగా ఉండాలన్నారు. ఏ సంస్కరణ అయినా పన్ను ఆధారాన్ని అనవసరంగా తగ్గించకుండా మధ్యతరగతికి ఉపశమనం కలిగించేలా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మార్పులు వినియోగంపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశముంది.

Advertisement

వివరాలు 

హౌసింగ్ ఫైనాన్స్ రంగం కీలక వృద్ధి

ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు అదనంగా వినియోగించదగిన ఆదాయం పెరిగితే,గృహనిర్మాణం,ఆటోమొబైల్ రంగం,వినియోగ వస్తువులపై ఖర్చులు స్పష్టంగా పెరుగుతాయని అంచనా. ముఖ్యంగా హౌసింగ్ ఫైనాన్స్ రంగం కీలక వృద్ధి సాధనంగా కొనసాగుతుండటంతో,పట్టణ మార్కెట్ వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం రూ.45లక్షలుగా ఉన్న సరసమైన గృహాల ధర పరిమితిని పునఃపరిశీలించాలనే వాదన బలపడుతోంది. అలాగే MSMEల పరిధిలో ఉద్యోగులకు ESOPలు అందించే సంస్థలకు పన్ను సమానత్వాన్ని విస్తరించే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణానికి అనుసంధానమైన పన్ను సంస్కరణలు,సరళీకృత పొదుపు ప్రోత్సాహకాలు, డిజిటల్ సాధికారతను మరింత లోతుగా తీసుకెళ్లే చర్యలతో బడ్జెట్‌-2026 కేవలం ఆర్థిక సమతుల్యతకే కాకుండా, గృహ విశ్వాసాన్ని పెంచి ఆర్థిక వృద్ధికి వేగం అందిస్తుందనే ఆశలు నెలకొన్నాయి.

Advertisement