LOADING...
Budget 2026: ఆదాయపు పన్ను వ్యవస్థలో మార్పులు.. భార్యాభర్తలు కలిసి ట్యాక్స్ కడితే రూ. 8 లక్షల వరకు సున్నా పన్ను?
భార్యాభర్తలు కలిసి ట్యాక్స్ కడితే రూ. 8 లక్షల వరకు సున్నా పన్ను?

Budget 2026: ఆదాయపు పన్ను వ్యవస్థలో మార్పులు.. భార్యాభర్తలు కలిసి ట్యాక్స్ కడితే రూ. 8 లక్షల వరకు సున్నా పన్ను?

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 20, 2026
02:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ఆదాయపు పన్ను వ్యవస్థలో త్వరలోనే కీలక మార్పులు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. వివాహిత జంటలకు సంబంధించిన పన్ను విధానంలో సంస్కరణలు తీసుకురావాలని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఒక ముఖ్యమైన సిఫార్సును చేసింది. ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే మధ్యతరగతి కుటుంబాలకు గణనీయమైన పన్ను ఊరట లభించే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో భార్య, భర్త ఇద్దరూ సంపాదిస్తున్నా వారు విడివిడిగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిందే. అయితే ICAI సూచనల ప్రకారం,భవిష్యత్తులో భార్యాభర్తలు ఇద్దరూ తమ ఆదాయాన్ని కలిపి ఒకే రిటర్న్‌గా ఉమ్మడిగా పన్ను దాఖలు చేసే అవకాశం కల్పించాలన్నది ప్రధాన ఆలోచన.

వివరాలు 

మినహాయింపు పరిమితి పెంపు

దీనినే 'ఉమ్మడి పన్ను విధానం' లేదా 'జాయింట్ ట్యాక్స్ ఫైలింగ్'గా పేర్కొంటున్నారు. ఈ విధానం అమలైతే కలిగే ప్రధాన లాభాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది మినహాయింపు పరిమితి పెంపు. ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో వ్యక్తిగతంగా రూ. 4 లక్షల వరకు ప్రాథమిక మినహాయింపు ఉంది. జంటలు కలిసి పన్ను ఫైల్ చేస్తే ఈ పరిమితిని రెట్టింపు చేసి రూ. 8 లక్షలకు పెంచాలని ICAI సూచించింది. అలా జరిగితే రూ. 8 లక్షల వరకు ఉన్న ఉమ్మడి ఆదాయంపై ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.

వివరాలు 

పన్ను స్లాబ్‌లలో కూడా మార్పులు చేయాలని ICAI సూచన

ఇంకొక ముఖ్యమైన ప్రయోజనం ఒకే వ్యక్తి సంపాదనపై ఆధారపడిన కుటుంబాలకు దక్కనుంది. ఇంట్లో ఒకరే ఉద్యోగం లేదా వ్యాపారం ద్వారా ఆదాయం పొందుతూ, మరొకరు ఆధారంగా ఉన్న కుటుంబాల్లో పన్ను భారం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. దీంతో ఆ కుటుంబాల ఆర్థిక స్థితి మరింత బలపడుతుందని భావిస్తున్నారు. అదేవిధంగా పన్ను స్లాబ్‌లలో కూడా మార్పులు చేయాలని ICAI సూచించింది. ప్రస్తుతం త్వరగా వర్తించే గరిష్ట పన్ను రేటు (30 శాతం) పరిమితిని పెంచాలని కోరింది. ఉమ్మడి ఆదాయం రూ. 48 లక్షలు దాటినప్పుడు మాత్రమే 30 శాతం పన్ను రేటు అమలు చేయాలన్నది ప్రతిపాదన. బడ్జెట్ 2026ను దృష్టిలో ఉంచుకుని వ్యక్తిగత పన్ను నిర్మాణంలో కూడా మార్పులు అవసరమని ICAI అభిప్రాయపడింది.

Advertisement

వివరాలు 

పన్ను వ్యవస్థ కూడా ఉమ్మడిగా ఉండటం సమంజసమే

ఈ ప్రతిపాదనపై నిపుణుల నుంచి కూడా సానుకూల స్పందన వస్తోంది. స్టెల్లార్ ఇన్నోవేషన్స్ వైస్ ప్రెసిడెంట్ కార్తీక్ నారాయణ్ మాట్లాడుతూ, ఈ విధానం కుటుంబాల ఆర్థిక నిర్వహణను మరింత సులభతరం చేస్తుందని అన్నారు. ప్రస్తుతం గృహ ఖర్చులు భార్యాభర్తలు కలిసి భరిస్తున్నారని, అలాంటి పరిస్థితిలో పన్ను వ్యవస్థ కూడా ఉమ్మడిగా ఉండటం సమంజసమేనని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే డిజిటల్ విధానంలో పన్ను చెల్లింపులు మరింత సరళంగా, సౌకర్యవంతంగా మారతాయని తెలిపారు.

Advertisement