Byju's: ఇళ్లను తాకట్టు పెట్టి.. ఉద్యోగులకు జీతాలు చెల్లించిన బైజూస్ వ్యవస్థాపకుడు
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్రముఖ ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్(Byju's)కు కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని దీన స్థితిలోకి బైజూస్ వెళ్లిపోయింది.
ఈ క్రమంలో కంపెనీ ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు బైజూస్ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్(Byju Raveendran) తన ఇళ్లను తనఖా పెట్టినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక చెబుతోంది.
హోమ్ లోన్ సొమ్ముతో రవీంద్రన్ తన ఉద్యోగులకు జీతాలు చెల్లించినట్లు వెల్లడించింది.
రవీంద్రన్ కుటుంబానికి చెందిన రెండు ఇళ్లు, ఎప్సిలాన్‌లో నిర్మాణంలో ఉన్న విల్లాను మొత్తం 12 మిలియన్ డాలర్లకు బ్యాంకులో తాకట్టు పెట్టినట్లు తెలుస్తోంది.
బైజూస్ మాతృ సంస్థ 'థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్'లో 15,000 మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి 12 మిలియన్ డాలర్లను ఉపయోగించినట్లు బ్లూమ్‌బెర్గ్ పేర్కొంది.
బైజూస్
ఇళ్లను తాకట్టు పెట్టడంపై స్పందించని బైజూస్ ప్రతినిధులు
ఇళ్లను బ్యాంకు తాకట్టు పెట్టిన విషయంపై అటు రవీంద్రన్ కానీ, బైజూస్ ప్రతినిధులు స్పందించలేదు.
తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న బైజూస్ తన యూఎస్ ఆధారిత పిల్లల డిజిటల్ రీడింగ్ ప్లాట్‌ఫారమ్‌ను సుమారు 400మిలియన్ డాలర్లకు విక్రయించే ప్రక్రియలో ఉంది.
మరో వైపు 1.2బిలియన్ డాలర్ల టర్మ్ లోన్‌పై వడ్డీ చెల్లింపులను డిఫాల్ట్ చేయడంపై ఇప్పుడు రుణదాతలతో న్యాయపోరాటం చేస్తోంది.
ఇప్పటికే రవీంద్రన్ కంపెనీలో తన షేర్లన్నింటినీ తాకట్టు పెట్టి సుమారు 400 మిలియన్ డాలర్ల వ్యక్తిగత రుణాన్ని సేకరించారు.
ఇన్ని ఇబ్బందుల నడుమ ఆయన మరో 12 మిలియన్ డాలర్లను తన ఇళ్లను తాకట్టు పెట్టి తీసుకున్నారు. బైజు యజమాని రవీంద్రన్ ఆస్తుల విలువ ప్రస్తుతం 5 బిలియన్ డాలర్లు.