UPI-ICD: ఎటిఎం కార్డుల అవసరం లేకుండా నగదు డిపాజిట్, డ్రా సౌకర్యం
ఇప్పటివరకు ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకోవడానికి కస్టమర్లు ఏటీఎం కార్డ్ అవసరం ఉండేది. కానీ ఇప్పుడు, ఏటీఎం కార్డులు అవసరం లేకుండా యూపీఐ ద్వారా నగదు డిపాజిట్ చేసే కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇది భారతీయ బ్యాంకుల ద్వారా అందించబడుతున్న సీడీఎం (కాష్ డిపాజిట్ మిషన్) మెషీన్ల ద్వారా కస్టమర్లు తమ ఖాతాల్లో నగదు జమ చేసుకోవడానికి సౌకర్యాన్ని అందిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా యూపీఐ ఇంటర్‌ఆపరబుల్ క్యాష్ డిపాజిట్ (UPI-ICD) అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2024లో ఆవిష్కరణ
ఈ సేవలను ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2024 లో డిప్యూటీ గవర్నర్ టి. రబీ శంకర్ ఆవిష్కరించారు. ఆర్బీఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో UPI ఇంటర్‌ఆపరబుల్ క్యాష్ డిపాజిట్ అనే కొత్త ఫీచర్‌ను ఇటీవల ప్రవేశపెట్టారు. ఈ ఫీచర్ ఏటీఎంలో నగదు డిపాజిట్లలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. UPI-ICD అనేది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ ద్వారా కస్టమర్లు తమ బ్యాంక్ ఖాతాల్లో లేదా ఇతర బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేసేందుకు అనుమతించే ఒక కొత్త సదుపాయం.
ఎలా ఉపయోగించాలంటే?
కస్టమర్‌లు ఎటిఎంలలో నగదు డిపాజిట్ ఎంపికను ఎంచుకోవాలి. వారు UPI-లింక్డ్ మొబైల్ నంబర్ లేదా వర్చువల్ చెల్లింపు చిరునామాను ఎంటర్ చేయాలి. ఇక మీరు ఉపయోగించే యూపీఐ యాప్ నుంచి స్కాన్ చేయాలి. ఆ తర్వాత వివరాలు కన్పిస్తాయి. మెషిన్ డిపాజిట్ స్లాట్‌లో నగదును ఇన్సర్ట్ చేయాలి. ఎటిఎం డిపాజిట్‌ని ప్రాసెస్ చేస్తుంది. పేర్కొన్న ఖాతాకు క్రెడిట్ చేస్తుంది. బ్యాంకుల ఏటీఎంలు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంది.