LOADING...
Windfall tax: కేంద్రం కీలక నిర్ణయం.. విండ్‌ఫాల్‌ ట్యాక్స్ రద్దు
కేంద్రం కీలక నిర్ణయం.. విండ్‌ఫాల్‌ ట్యాక్స్ రద్దు

Windfall tax: కేంద్రం కీలక నిర్ణయం.. విండ్‌ఫాల్‌ ట్యాక్స్ రద్దు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 02, 2024
03:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొంతకాలంగా ఈ విషయంపై చర్చలు జరిపిన కేంద్రం, అంతర్జాతీయ చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 2022 జులై 1న ముడి చమురు, పెట్రోల్‌, డీజిల్‌, ఏటీఎఫ్‌ ఎగుమతులపై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను కేంద్రం విధించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగి కంపెనీలు అధిక లాభాలు పొందడంతో ఈ పన్నును అమలు చేయడం ప్రారంభించారు. అయితే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు 72-75 డాలర్ల మధ్య స్థిరంగా ఉండటంతో ఈ ట్యాక్స్ అవసరం లేదని కేంద్రం భావించింది.

Details

రిలయన్స్,  ఓఎన్‌జీసీ కంపెనీలకు పెద్ద ఊరట

కేంద్రం తాజా నిర్ణయంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఓఎన్‌జీసీ వంటి కంపెనీలకు పెద్ద ఊరట లభించింది. విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ తొలగింపుతో ఆయా సంస్థల రిఫైనింగ్‌ మార్జిన్లు పెరిగే అవకాశం ఉంది. ఇందుకు తోడు పెట్రోల్‌, డీజిల్‌ ఎగుమతులపై విధిస్తున్న రోడ్డు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెస్సును కూడా రద్దు చేయడం మరింత శుభపరిణామంగా కనిపిస్తోంది. విండ్‌ఫాల్‌ ట్యాక్స్ రద్దు ప్రకటనతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ 1.30 శాతం లాభపడి రూ.1309 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ నిర్ణయం దేశీయ చమురు రంగంలో మాత్రమే కాకుండా, పెట్టుబడిదారులకు కూడా విశ్వాసాన్ని పెంచిందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ చమురు మార్కెట్‌పై ఆధారపడకుండా దేశీయ రంగాన్ని మరింత పటిష్టంగా నిలబెట్టే అవకాశం కల్పిస్తుంది.