Onion price: ఉల్లి ధరల నియంత్రణకు కేంద్రం కీలక చర్యలు
దేశంలో ఉల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలను చేపట్టింది. ఇప్పటికే నిల్వ చేసిన 4.7 లక్షల టన్నుల ఉల్లి బఫర్ స్టాక్‌ను హోల్‌సేల్ మార్కెట్లోకి విడుదల చేయాలని నిర్ణయించింది. ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేయడంతో రిటైల్ మార్కెట్లో ధరలు పెరుగుతాయన్న అంచనాతో కేంద్రం ముందస్తు చర్యలు తీసుకుంది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి నిధి ఖరే ఈ విషయాన్ని వెల్లడించారు. కేంద్రం, ఉల్లి రిటైల్ ధరలను నియంత్రించేందుకు బఫర్ స్టాక్‌ను విడుదల చేయడంతో పాటు, రాయితీ ధరలకు ఉల్లిని విక్రయించే ప్రణాళికను సైతం పరిశీలిస్తోంది.
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత
ముంబయి, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో ఉల్లి ధరలు రూ.58 నుంచి రూ.60 వరకు పెరిగిన వేళ, మొబైల్ వ్యాన్ల ద్వారా రూ.35కే కిలో ఉల్లిని విక్రయించనున్నట్లు చెప్పారు. ఇది దిల్లీతో పాటు, జాతీయ సగటు ధర కంటే ఎక్కువగా ఉన్న ఇతర నగరాల్లో కూడా అమలు చేయనున్నారు. ఉల్లి రైతులకు మెరుగైన ధరలను పొందేందుకు, 550 డాలర్ల కనీస ఎగుమతి ధరను కేంద్రం తొలగించింది. ఆంక్షలను ఎత్తివేయడంతో దేశీయ ఉల్లి రైతులకు ప్రయోజనం కలిగిస్తామని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది. ఉల్లితో పాటు ముడి పామాయిల్, రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై సుంకాన్ని కేంద్రం పెంచింది. ఈ చర్యతో దేశీయంగా వంట నూనెల ధరలను కూడా సమతూకం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.