LOADING...
Central GovT: కేంద్ర ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం.. పొగాకు, పాన్ మసాలా ఉత్పత్తులపై భారీగా పన్ను..
పొగాకు, పాన్ మసాలా ఉత్పత్తులపై భారీగా పన్ను..

Central GovT: కేంద్ర ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం.. పొగాకు, పాన్ మసాలా ఉత్పత్తులపై భారీగా పన్ను..

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 01, 2025
09:26 am

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం పొగాకు సంబంధిత ఉత్పత్తులపై అమలులో ఉన్న పన్ను విధానంలో కీలక మార్పులకు సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కా వంటి ఉత్పత్తులపై ప్రస్తుతం కొనసాగుతున్న పన్ను వ్యవస్థను పునర్వ్యవస్థీకరించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో రెండు ప్రధాన బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. మొదటిది 'హెల్త్ సెక్యూరిటీ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు-2025', రెండోది సెంట్రల్ ఎక్సైజ్ చట్ట సవరణ బిల్లు. ప్రస్తుతం అమలులో ఉన్న జీఎస్టీ పరిహార సెస్సును రద్దు చేసి, కొత్త పేరుతో కానీ దాదాపు అదే విధానంతో పన్నుల వసూళ్లను కొనసాగించేలా ఈ బిల్లులను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

వివరాలు 

ఈ మార్పు వల్ల పన్నుల వసూలు ప్రక్రియ మరింత సులభం

ప్రస్తుతం సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కా తదితర ఉత్పత్తులపై జీఎస్టీతో పాటు కంపెన్సేషన్ సెస్సు కూడా వసూలవుతోంది. అయితే ఈ సెస్సు త్వరలో ముగియనుండటంతో, ప్రభుత్వానికి వచ్చే ఆదాయ లోటును తప్పించుకోవడానికి అదే తరహా సెస్సును కొత్త చట్టం ద్వారా కొనసాగించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మార్పు వల్ల పన్నుల వసూలు ప్రక్రియ మరింత సులభం కావడం, విధానాల్లో స్పష్టత పెరగడం, వ్యవస్థలో పారదర్శకత మెరుగుపడటం లక్ష్యాలుగా పెట్టుకుంది. సామాన్య వినియోగదారులకు వెంటనే ధరల పెరుగుదల ఉండదని నిపుణులు చెబుతున్నారు, ఎందుకంటే పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు ఉండబోవడం లేదట. అయితే తయారీ సంస్థల పరంగా రిపోర్టింగ్ విధానాలు, అకౌంటింగ్ ప్రక్రియలు, పన్ను కంప్లయన్స్ సంబంధిత పద్ధతుల్లో మార్పులు వచ్చే అవకాశముంది.

వివరాలు 

సెంట్రల్ ఎక్సైజ్ చట్టం కిందకు సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు 

ఇప్పటికే అధిక పన్నుల భారాన్ని మోస్తున్న సిగరెట్ పరిశ్రమపై కొత్త చట్టం అమలుతో మరింత కఠినమైన నియంత్రణలు, పర్యవేక్షణ పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఇదే సమయంలో సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులను జీఎస్టీ పరిధి నుంచి తీసివేసి తిరిగి సెంట్రల్ ఎక్సైజ్ చట్టం కిందకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మార్పుతో ఉత్పత్తి దశ నుంచే పన్నుల ట్రాకింగ్ సులభం కావడం, తయారీ కేంద్రాలపై సమర్థవంతమైన తనిఖీలు నిర్వహించడం సాధ్యం అవుతుంది. దీని ద్వారా పన్ను ఎగవేతలు అరికట్టడం, అక్రమ రవాణాను నియంత్రించడం, పన్ను వసూళ్ల వ్యవస్థను మరింత క్రమబద్ధం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

Advertisement

వివరాలు 

ప్రజారోగ్య పరిరక్షణ దిశగా చర్యలు

ఈ నిర్ణయంతో ఆర్థిక ప్రయోజనాలకే కాకుండా ప్రజారోగ్య పరిరక్షణ దిశగా కూడా చర్యలు తీసుకున్నట్లు అవుతుంది. ఎందుకంటే పాన్ మసాలా, గుట్కా, పొగాకు ఆధారిత ఉత్పత్తులు ఆరోగ్యానికి హానికరం కావడంతో వీటి వినియోగాన్ని తగ్గించేందుకు అధిక పన్నుల విధానాన్ని ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఇదే ఉద్దేశంతో కొత్తగా ప్రతిపాదిస్తున్న సెస్సుకు 'ఆరోగ్య భద్రత' అనే పేరు పెట్టనున్నట్లు సమాచారం.

Advertisement