LOADING...
Jet Fuel: విమానయాన సంస్థలకు కేంద్రం భారీ ఊరట.. జెట్ ఫ్యూయల్ ధరల స్థిరీకరణకు ₹10,000 కోట్లు
జెట్ ఫ్యూయల్ ధరల స్థిరీకరణకు ₹10,000 కోట్లు

Jet Fuel: విమానయాన సంస్థలకు కేంద్రం భారీ ఊరట.. జెట్ ఫ్యూయల్ ధరల స్థిరీకరణకు ₹10,000 కోట్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 03, 2026
04:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో విమానయాన రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఎయిర్‌లైన్స్‌కు ఉపశమనం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విమాన ఇంధన ధరల(జెట్ ఫ్యూయల్)స్థిరీకరణ కోసం రూ.10,000 కోట్ల ప్రత్యేక నిధిని కేంద్ర క్యాబినెట్ ఆమోదించినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా విమాన టర్బైన్ ఇంధనం (ATF)ధరలు గత కొద్ది నెలల్లో భారీగా పెరిగాయని ఆయన తెలిపారు. మార్చి 2026లో లీటరు ఏటీఎఫ్ ధర రూ.60.5 ఉండగా,మే 2026 నాటికి అది రూ.142కు చేరిందన్నారు. దీంతో విమానయాన సంస్థలతో పాటు చమురు సంస్థలపైనా గణనీయమైన ఆర్థిక భారం పడిందని పేర్కొన్నారు.

వివరాలు 

77 లక్షల ఉద్యోగాలకు రక్షణ

ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దేశీయ విమాన సర్వీసులకు ఉపయోగించే విమాన టర్బైన్ ఇంధనం ధరను లీటరుకు రూ.75.6గా స్థిరీకరించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిపారు. ఈ చర్యతో విమాన సర్వీసుల నిర్వహణలో అంతరాయాలు తలెత్తకుండా చూడటంతో పాటు ఎయిర్‌లైన్స్‌పై ఆర్థిక భారం కూడా తగ్గే అవకాశం ఉందన్నారు. ఏటీఎఫ్ ధరల స్థిరీకరణ వల్ల దేశంలోని విమానయాన రంగంపై ఆధారపడిన సుమారు 77 లక్షల ఉద్యోగాలకు రక్షణ లభిస్తుందని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. అలాగే పెరిగిన విమాన ఛార్జీల భారాన్ని తగ్గించి ప్రయాణికులకు కూడా కొంత ఊరటనిచ్చే అవకాశం ఉందన్నారు.

వివరాలు 

దిల్లీలో పాత ట్రక్కులు, బస్సులకు గుడ్‌బై

మరో కీలక నిర్ణయంగా దేశ రాజధాని దిల్లీలో పాత ట్రక్కులు, బస్సులను దశలవారీగా తొలగించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. వాటి స్థానంలో బీఎస్-6 ప్రమాణాల వాహనాలు, ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది. ఈ కొత్త వాహనాల కొనుగోలు, అమలుకు రూ.5,041 కోట్ల నిధుల విడుదలకు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది.

Advertisement